UP Film City Tender : ఉత్తర్‌ప్రదేశ్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి నిర్వహించిన టెండర్‌ను ప్రముఖ సినీనిర్మాత బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాఖలైన బిడ్లను ( UP Film City Bid ) మంగళవారం తెరిచిన యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అథారిటీ (వైఈఐడీఏ), బోనీ కపూర్ కంపెనీ అధిక మొత్తం కోట్ చేసినట్లు తెలిపింది. నోయిడాలో కొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి ఈ ఫిల్మ్ సిటీ ఏర్పాటు కానుంది.
'బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ' బోనీ కపూర్‌తో పాటు భుటానీ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తోంది. అధిక బిడ్ వేసి ప్రాజెక్ట్ గెలుచుకున్నప్పటికీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆమోదం తెలపాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత భూమిని ఆ సంస్థకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్- ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ ఫిల్మ్ సిటీని నిర్మించనున్నారు. వెయ్యి ఎకరాల్లో ఫిల్మ్ సిటీ రూపుదిద్దుకోనుంది. తొలి దశలో భాగంగా 230 ఎకరాల్లో ( UP Film City Area In Acres ) చిత్ర నగరిని అభివృద్ధి చేయనున్నారు.
దిగ్గజ సంస్థల పోటీ
ఫిల్మ్ సిటీ అభివృద్ధి ప్రాజెక్టు దక్కించుకునేందుకు బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో పాటు అనేక దిగ్గజ సంస్థలు, బాలీవుడ్ ప్రముఖులకు చెందిన కంపెనీలు పోటీ పడ్డాయి. టీ-సిరీస్‌గా సుపరిచితమైన సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అక్షయ్ కుమార్ భాగస్వామిగా ఉన్న సూపర్సోనిక్ టెక్నోబిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిల్మ్‌మేకర్ కేసీ బొకాడియాకు చెందిన 4 లయన్స్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
యోగి కలల ప్రాజెక్టు!
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీన్ని తన కలల ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ ఫిల్మ్ సిటీని నిర్మిస్తామని గతంలో యోగి తెలిపారు. రాష్ట్రంలో కొత్త సినిమా పాలసీని తీసుకొస్తామని ప్రకటించారు. యూపీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్, ఇన్ఫోటెయిన్మెంట్ కేంద్రం నిర్మించడం వల్ల సినీ నిర్మాణంలో ఉన్న వారు తమ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కొత్త మార్గం దొరుకుతుందని పేర్కొన్నారు.
ఇండియా కూటమికి మరో షాక్- చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు
సీఎం కార్లు సీజ్ చేసిన ఈడీ- సోదాల్లో రూ.36లక్షలు స్వాధీనం- భార్యకు పగ్గాలు!