UP Accident Today Shahjahanpur : ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్‌ను ఆటో రిక్షా ఢీకొట్టిన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంకర్ రాంగ్ రూట్లో వెళ్తోందని పోలీసులు తెలిపారు. పొగ మంచు కారణంగా దృశ్యమాన్యత తగ్గడం ప్రమాదానికి కారణమని వివరించారు.
బరేలీ- ఫరూఖాబాద్ హైవేపై అల్లాహగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుగ్సుగీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటో రిక్షా జలాలాబాద్ వైపు నుంచి వస్తోందని ఎస్పీ అశోక్ కుమార్ మీనా తెలిపారు. మృతుల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. మృతదేహాలను పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. పోలీసులు వచ్చే ముందు ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో సహాయం చేసినట్లు సమాచారం.
యోగి విచారం- సహాయక చర్యలకు ఆదేశం!
ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బ్రిడ్జిపై ఐదు వాహనాలు ఢీ
తమిళనాడులోని ధర్మపురిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన పైనుంచి వెళ్తున్న సమయంలో ఓ లారీ అదుపుతప్పి రెండుకార్లు సహా మరో రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. వేగంగా వచ్చిన ఓ లారీ ముందున్న మరో ట్రక్కును ఢీకొట్టింది. ఆ ట్రక్కు ముందున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయింది. నియంత్రణ కోల్పోయిన మూడో లారీ బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోయింది. ఘటన అనంతరం వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. సీసీటీవీలో రికార్డైన ప్రమాదం వీడియో చూసేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ట్రక్కు బోల్తా పడి ఆరుగురు మృతి- మరో 11 మందికి గాయాలు
స్కూల్ హాస్టల్లో మంటలు- 13 మంది మృతి- ఫ్యాక్టరీలో పేలుడుకు 8 మంది బలి