Stones Removed From Bladder : 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుంచి 6110 రాళ్లను తొలగించారు వైద్యులు. కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగికి కష్టతరమైన సర్జరీని నిర్వహించి ప్రాణాలు నిలబెట్టారు డాక్టర్లు. దాదాపు 30 నిమిషాలకు పైగా శ్రమించి విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశారు. రాజస్థాన్‌లోని కోటాలోని ఓ ఆస్పత్రికి చెందిన వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు.
అసలేం జరిగిందంటే?
బుండి జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో కోటాలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు రోగికి సోనోగ్రఫీ చేయగా అసలు విషయం బయటపడింది. వైద్య పరీక్షల్లో వృద్ధుడి పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయినట్లుగా, అలాగే దాని పరిమాణం రెట్టింపు అయినట్లు తేలింది. వెంటనే లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేశ్ కుమార్ నేతృత్వంలో వైద్య బృందం రోగికి శస్త్ర చికిత్స విజయవంతంగా చేసింది.
"పిత్తాశయంలోని రాళ్లను తొలగించకపోతే భవిష్యత్తులో అవి రోగికి హాని కలిగించేవి. క్లోమం వాపు, కామెర్లు, క్యాన్సర్ వంటి వాటి రోగాల బారిన పడే ప్రమాదం ఉండేది. పిత్తాశయంలో నుంచి రాళ్లను తీసే సర్జరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పిత్తాశయంలోని రంధ్రం కారణంగా ఆ రాళ్లు కడుపులోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోగి ఇన్ఫెక్షన్ బారిన పడతాడు. అందుకే గాల్ బ్లాడర్‌ను ఎండో బ్యాగ్ లో పెట్టి రాళ్లను తొలగించాం. ఈ సర్జరీకి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టింది. సెప్టెంబరు 5(శుక్రవారం)న ఆపరేషన్ చేశాం. ఒక రోజు తర్వాత (శనివారం) రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు."
--దినేశ్ జిందాల్, లాప్రోస్కోపిక్ సర్జన్
రాళ్లు లెక్కించడానికి రెండున్నర గంటల సమయం
రోగి పిత్తాశయం నుంచి రాళ్లు తీసిన తర్వాత వాటిని లెక్కించడానికి వైద్య సిబ్బందికి రెండున్నర గంటలకుపైగా సమయం పట్టింది. పిత్తాశయంలో వేల సంఖ్యలో రాళ్లు ఏర్పడటానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయని లాప్రోస్కోపిక్ సర్జన్ దినేశ్ జిందాల్ తెలిపారు. ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్, కొవ్వు పదార్థాలు, వేగంగా బరువు తగ్గడం వల్ల కూడా గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడొచ్చని వెల్లడించారు. మరోవైపు, రోగి బంధువులు కూడా పిత్తాశయంలోని పెద్ద సంఖ్యలో ఉన్న రాళ్లను తొలగించే శస్త్రచికిత్సను చేయించుకున్నట్లు తెలుస్తోంది.