Union On SC ST Creamy Layer : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
'ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఒక తీర్పునిచ్చింది. అందులో ఈ రిజర్వేషన్ల విషయంలో కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిపాం. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని క్యాబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించాం' అని అశ్వినీ వైష్టవ్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో సంపన్న శ్రేణిపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో శుక్రవారం బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. క్రీమీలేయర్ ప్రస్తావనపై ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో ఎటువంటి మార్పులు ఉండవని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇదీ కేసు
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను 2010లో పంజాబ్, హరియాణా హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎస్సీ కోటాలో ఉపవర్గీకరణలు రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని 2004లో 'ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్' కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2020లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టింది. దీనిపై పునఃసమీక్ష కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఆగస్టు 1న ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.