Union Budget 2024 Housing : వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల అర్బన్ హౌసింగ్‌కు ఆర్థిక చేయూత అందించేందుకు రూ.2.2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తామని పేర్కొన్నారు. రుణ మంజూరు వ్యవస్థలు, ఎంఎస్ఎంఈ సర్వీసుల వంటి మొత్తం 7 విభాగాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా అప్లికేషన్లను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. మహిళల పేరు మీద కొనే ఆస్తులపై పన్నును తగ్గిస్తామని పేర్కొన్నారు.
'ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్' పథకం కింద రూ.2.2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 'పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0' ద్వారా కోటి మంది పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.10 లక్షల కోట్ల సాయాన్ని అందించనున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే వచ్చే ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్ల సహాయాన్ని అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నిధుల ద్వారా అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీని అందించే స్కీంను కూడా అమలు చేస్తామని తెలిపారు. దేశంలో అద్దె ఇళ్ల లభ్యతను పెంచడమే కాకుండా వాటికి సంబంధించిన మార్కెట్‌లో పారదర్శకతను, నాణ్యతను పెంచడంపై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోని 30 లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాల్లో 100 వారాంతపు అంగడ్లు (హాట్స్) నిర్మించేందుకు అవసరమైన మద్దతును ప్రత్యేక పథకం ద్వారా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఇంటి అద్దెల ఆదాయంపై
ఇంటి అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇకపై 'ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్' విభాగంలో పరిగణించరని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. వాటిని 'ఇన్‌కమ్ ఫ్రం హౌస్ ప్రాపర్టీ' అనే ప్రత్యేక విభాగంలో చేరుస్తారని వెల్లడించారు. స్థిరాస్తి క్రయ,విక్రయాలపై టీడీఎస్ విధించే అంశంపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిరాస్తిని విక్రయించే వ్యక్తుల సంఖ్య దాన్ని కొనుగోలు చేసే వ్యక్తుల సంఖ్య ఆధారంగా మొత్తం లావాదేవీపై టీడీఎస్‌ను ఇకపై విధిస్తారని నిర్మల ప్రకటించారు.
బినామీదారులకు మినహాయింపులు
బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ నిషేధ చట్టం - 1988లోనూ కీలక సవరణలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. బినామీదారుడిగా ఉన్న వ్యక్తి దర్యాప్తు సంస్థల ఎదుట నిజాన్ని ఒప్పుకుంటే జరిమానా, శిక్షల నుంచి మినహాయింపు కల్పించే నిబంధనను చట్టంలో చేరుస్తామని ఆమె ప్రతిపాదించారు. బినామీ ఆస్తులను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసే విషయంలో హేతుబద్ధమైన కాల పరిమితిని కూడా కొత్తగా నిర్దేశించారు. రుణ మంజూరు వ్యవస్థలు, ఎంఎస్ఎంఈ సర్వీసుల వంటి మొత్తం 7 విభాగాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా అప్లికేషన్లను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు.
మహిళల పేరుపై కొనే ఆస్తులపై సుంకాలు తగ్గింపు
మహిళ పేరిట కొనే ఆస్తులపై పన్నుల భారాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విధానాన్ని దేశంలోని పట్టణ అభివృద్ధి పథకంలో భాగంగా మారుస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ దిశగా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మల ప్రకటించారు. మహిళల పేరిట కొనే ఆస్తులకు భారీ స్టాంపు డ్యూటీ బాదుడు నుంచి మినహాయింపు కల్పిస్తామన్నారు. ట్యాక్సులకు సంబంధించిన లావాదేవీలలో ఆధార్ నంబర్ బదులుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని వినియోగించే పద్ధతిని ఇకపై మానేస్తామని ప్రకటించారు.
కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024