TTD Cancelled VIP Break Darshan for Two Days in July: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొందరు కాలి నడక ద్వారా ఏడు కొండలు ఎక్కి తమ మొక్కులు, ముడుపులను చెల్లించుకుంటారు. ఆ ఏడుకొండల వాడికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారు. రోజూ వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమల నిత్యం కళ్యాణం పచ్చతోరణంలా అలరారుతోంది. ఈ క్రమంలోనే తిరుమల వెళ్లే భక్తులను అలర్ట్ చేస్తూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు: జులై నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది టీటీడీ. రెండు రోజుల పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో జులై 9వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే జులై 16వ తేదీ సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని జరపనున్నారు. ఈ రెండిటినీ పురస్కరించుకుని జులై 9, జులై16న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాబట్టి.. ఈ రెండు రోజులకు సిఫారసు లేఖలు స్వీకరించరని టీటీడీ తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి.. దర్శనాలకు రావాలని సూచించింది.
తిరుమలపై జరుగుతున్న ఆ ప్రచారం అబద్ధం - భక్తులు అలా చేయొద్దు - స్పందించిన టీటీడీ
ఆ రోజున స్వామి వారి దర్శన సమయంలో మార్పులు: జులై 9న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున స్వామివారి దర్శన సమయంలో పలు మార్పులు చేసింది టీటీడీ. ఇందులో భాగంగా జులై 9న ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామి వారి మూల విరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
జులై 16న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.