Train Robbery Attempt In Uttarakhand : రైలు సిగ్నల్ లైట్లకు బురద రాసి రెండు ట్రైన్లు ఆగేటట్లు చేశారు కొందరు దుండగులు. అనంతరం రైలులో ఉన్న ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారం, ఇతర వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికులు ఎదురుతిరిగడం వల్ల వారిపై రాళ్లు రువ్వారు దుండగులు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే?
మొరాదాబాద్-సహారన్ పుర్ రైల్వే డివిజన్‌కు చెందిన లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైలు సిగ్నల్‌పై కొందరు దుండగులు బురద రాశారు. సిగ్నల్ లేకపోవడం వల్ల పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్, గోరఖ్ పుర్- చండీగఢ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికుల దగ్గర ఉన్న వస్తువులు, నగదును దోపీడి చేసేందుకు దుండగులు యత్నించి విఫలమయ్యారు. ప్రయాణికులు ఎదురు తిరగడం వల్ల అక్కడినుంచి పరారయ్యారు. వెంటనే లోకో పైలట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లక్సర్ ఆర్పీఎఫ్ ఇన్ ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రవి శివాచ్, జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ హెడ్ సంజయ్ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితా దోవల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు.
రైలు సిగ్నల్‌పై బురద
లక్సర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తన్న పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు రూర్కీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. శుక్రవారం మధ్యాహ్నానికి ఈ రైలు లక్సర్ రైల్వే స్టేషన్‌కు ఈ రైలు చేరింది. అప్పటికే దుండగులు రైలు సిగ్నల్‌పై బురద రాశారు. దీంతో సిగ్నల్ కనిపించకపోవడం వల్ల లోకో పైలట్ రైలును ఆపారు. ఆ వెనుక వస్తున్న గోరఖ్ పుర్- చండీగఢ్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా సిగ్నల్ లేకపోవడం వల్ల లోకో పైలట్ ఆపేశారు. కాగా, రైలు ప్రయాణికుల నుంచి దోపిడీ, రాళ్ల దాడికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని లక్సర్ ఆర్పీఎఫ్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రవి శివాచ్ తెలిపారు. రైలును ఆగేలా చేసినందుకు గుర్తు తెలియని దుండగులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
కదులుతున్న బస్సులో సడెన్‌గా మంటలు- 9మంది సజీవ దహనం- మరో 24మందికి గాయాలు - Bus Fire Accident