Sabarimala Queue Online Booking : మకరవిళక్కు సీజన్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ పద్ధతి ద్వారా మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతించాలన్న కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సమర్థించింది. యాత్రికులతోపాటు పుణ్యక్షేత్రాల భద్రతను నిర్ధరించడానికి ఈ వ్యవస్థ అవసరమని శుక్రవారం పేర్కొంది. ఒక మంచి ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని టీడీబీ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు.
శబరిమలకు వచ్చే భక్తులను వెనక్కి పంపబోమని, దర్శనం చేసుకోకుండా ఎవరూ తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రశాంత్ చెప్పారు. వర్చువల్ క్యూ బుకింగ్ అనేది శబరిమలను సందర్శించే ప్రతి భక్తుడి అధికారిక రికార్డుని, స్పాట్ బుకింగ్ అనేది కేవలం ప్రవేశ అనుమతి పత్రమని తెలిపారు. 2022-23 సీజన్‌లో స్పాట్ బుకింగ్‌ల సంఖ్య 3,95,634 కాగా, ఆ తర్వాతి సీజన్‌లో అది 4,85,063కి పెరిగిందని ఆయన చెప్పారు. సాధారణంగా వర్చువల్ క్యూ సిస్టమ్ ఉన్నప్పుడు స్పాట్ బుకింగ్ తగ్గాలని, కానీ ఇక్కడ పెరిగిందని తెలిపారు. అది మంచి పరిణామం కాదని అభిప్రాయపడ్డారు.
యాత్రికుల సంఖ్య పెరిగితే టీడీబీకే మంచిదని ప్రశాంత్ అన్నారు. హుండీ సేకరణ, ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదాయాం పెరుగుతుందని చెప్పారు. కానీ అన్నింటి కన్నా యాత్రికుల భద్రత తమకు ముఖ్యమని చెప్పారు. భక్తులు, దేవాలయం రెండింటి భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. శబరిమల ఏ ఇతర ఆలయాల మాదిరి కాదని అన్నారు. కొండపై భక్తుల రద్దీ అత్యంత ప్రాధాన్యమైన అంశమని చెప్పారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో!
గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి పయనమయ్యారు. అప్పట్లో దేవస్థానం బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల కేరళ ప్రభుత్వం తెలిపింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది.
దర్శన వేళల పొడిగింపు
అయితే మకరవిళక్కు సీజన్‌లో రద్దీని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఆలయ దర్శన వేళలను పొడిగించారు. భక్తులు ఉదయం 3 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. మొత్తం రోజుకు 17 గంటలపాటు దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు.