Tamilnadu Pickle Issue : మామూలుగా మనం హోటల్‌కు వెళ్లి భోజనం పార్సిల్ తెచ్చుకుని తినేటప్పుడు ఏదైనా ఒక కూరో, పచ్చడో రాకపోతే ఏం చేస్తాం? ఆ మర్చిపోయాడనుకుని అలాగే తినేసి తర్వాత మర్చిపోతాం. కానీ తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి మాత్రం ఊరుకోలేదు. భోజనంలో ఊరగాయ లేదన్న కారణానికి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అంతే కాదు రెండేళ్లపాటు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి ఆ భోజనం ఇచ్చిన రెస్టారెంట్‌కు జరిమానా పడేలా చేసి విజయం సాధించాడు. భోజనం పార్సిల్‌లో ఊరగాయ మర్చిపోయినందుకు ఆ రెస్టారెంట్ ఆరోగ్య స్వామికి అక్షరాలా రూ.35,025 చెల్లించింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది.
ఇంతకీ ఏమైందంటే?
తన బంధువు 2021 నవంబర్ 28న మరణించాడని, అతడి తొలి వర్ధంతి సందర్భంగా 25 మంది వృద్ధులకు ఆహారం అందించాలని నిర్ణయించుకున్నానని, ఆరోగ్య స్వామి అనాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. 2022 నవంబర్ 27న విల్లుపురంలోని బాలమురుగన్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆరోగ్య స్వామి భోజనం ధర అడిగి తెలుసుకున్నారు. 'భోజనం రూ.70 పార్శిల్ రూ.80' అని రెస్టారెంట్ యజమాని బాలమురుగన్ ఆరోగ్యస్వామికి చెప్పాడు. భోజనం పార్సిల్‌లో ఏమేం ఇస్తారో జాబితాతో పాటు ఎంత ఖర్చు అవుతుందో కొటేషన్ వేసి రశీదును ఆరోగ్య స్వామికి ఇచ్చాడు.
నవంబర్ 28న 25 ఆహార పొట్లాలు అవసరమని ఆర్డర్ ఇచ్చిన ఆరోగ్య స్వామి, 25 పార్సిల్‌లకు రూ.80 చొప్పున రూ.2వేలు చెల్లించాడు. తాను చెల్లించిన డబ్బుకు రశీదు ఇవ్వాలని ఆరోగ్య స్వామి అడగ్గా రెస్టారెంట్ యజమాని చేతితో రాసిన రశీదు ఇచ్చాడు. అనంతరం భోజన పార్సిల్లు తీసుకుని ఆరోగ్యస్వామి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి వృద్ధులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
అయితే భోజన ప్యాకెట్లలో ఊరగాయ లేకపోవడాన్ని ఆరోగ్య స్వామి గుర్తించి తిరిగి వెళ్లి రెస్టారెంట్ యజమానిని అడిగాడు. అయితే 25 ప్యాకెట్ల భోజనానికి ఊరగాయ ఇవ్వనందుకు రూ.25 తిరిగి ఇవ్వాలని ఆరోగ్యస్వామి రెస్టారెంట్ యజమానిని అడిగాడు. దానికి రెస్టారెంట్ యజమాని తిరస్కరించడం వల్ల విల్లుపురం జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.
జరిమానా కట్టాలంటూ తీర్పు
ఈ పిటిషన్‌ను విచారించిన వినియోగదారుల కమిషన్, ఆరోగ్యస్వామికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఊరగాయ ఇవ్వకపోవడం రెస్టారెంట్ చేసిన సేవా లోపమని తీర్పు ఇచ్చింది. రెస్టారెంట్ యజమాని రూ.30 వేలు చెల్లించాలని, ఖర్చుల కోసం రూ. 5వేలు, ఊరగాయల ప్యాకెట్‌కు రూ.25లను 45 రోజులలోపు ఇవ్వాలని ఆదేశించింది.