Tamil Nadu Governor Speech : తమిళనాడులో అధికార డీఎంకే సర్కారు, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు సందర్భంగా శాసనసభకు వచ్చిన గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు. జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ రెండు నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించేశారు.
సోమవారం తమిళనాడు శాసనసభ సమావేశాలు ప్రారంభయ్యాయి. సాధారణంగా ఈ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన గవర్నర్ ఆన్ ఎన్ రవి కొన్ని నిమిషాల్లోనే ముగించేశారు. ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని చదవలేనని స్పష్టం చేశారు. ప్రసంగంలో కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయని అందుకే నేను విభేదిస్తున్నట్లు చెప్పారు. దీంతో గవర్నర్‌కు బదులుగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని స్పీకర్ చదివి వినిపించారు.
"గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని నేను పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చెప్పిన చాలా అంశాలను నైతిక కారణాలతో నేను అంగీకరించలేదు. వాటి విషయంలో విభేదిస్తున్నాను. ప్రసంగంలో వాటిని పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అందుకే ఇంతటితోనే నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఈ సమావేశాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నా."
-ఆర్. ఎన్. రవి, తమిళనాడు గవర్నర్
గతేడాది కూడా ప్రసంగం విషయంలో గవర్నర్ ఇలానే వ్యవహరించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగంలోని పలు అంశాలను గవర్నర్ ఆర్. ఎన్ రవి చదవకుండా వదిలివేశారు. సొంతంగా కొన్ని అంశాలను చేర్చి మాట్లాడారు. దీంతో స్టాలిన్ సర్కార్ ప్రభుత్వం సిద్ధం చేసిన గవర్నర్ ప్రసంగాన్ని మాత్రమే యథాతథంగా రికార్డులో నమోదు చేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ వ్యవహారం గవర్నర్, స్టాలిన్ సర్కార్ మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా మరోసారి ఆయన ప్రసంగించేందుకు నిరాకరించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా ఇటీవలే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగాన్ని రెండు నిమిషాల్లోపే ముగించారు. ప్రభుత్వం రాసి ప్రభుత్వం ఇచ్చిన 62 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు ఇష్టపడలేదు. కేవలం 84 సెకన్లలో చివరి పేరాను చదివి సభ నుంచి వెళ్లిపోయారు.
'స్పీకర్ ప్రవర్తన కారణంగానే వాకౌట్'
ప్రసంగం ప్రారంభం, చివరిలో జాతీయ గీతాన్ని ఆలపించాలని గవర్నర్ ఆర్ఎన్ రవి ఇచ్చిన సలహాను స్టాలిన్ సర్కార్ పట్టించుకోలేదని రాజ్‌భవన్ ఆరోపించింది. అలానే స్పీకర్ ఎం అప్పావు ప్రవర్తన కారణంగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారని తెలిపింది. " స్పీకర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చవదటం పూర్తి చేశాక జాతీయ గీతం కోసం గవర్నర్ లేచి నిలబడ్డారు. అయితే గవర్నర్‌ను నాథూరామ్ గాడ్స్ అనుచరుడు అని స్పీకర్ పిలిచారు. అందుకే గవర్నర్ తన పదవిని, సభను గౌరవించి బయటకు వెళ్లిపోయారు" అని రాజ్ భవన్ పేర్కొంది.
నీతీశ్ సర్కార్ బలపరీక్ష- ఆర్జేడీ కార్యకర్తల నిరసన- పలువురు అరెస్ట్
'దిల్లీ చలో'కు రైతుల పిలుపు- రోడ్లపై ముళ్లకంచెలు, కాంక్రీట్ దిమ్మెలు- పోలీసులు హైఅలర్ట్