AI For Animal Warning : తరచూ జనసంచారంలోకి వస్తున్న వన్యప్రాణులకు తమిళనాడు అటవీ శాఖ కృత్రిమ మేధతో(AI) అడ్డుకట్ట వేసింది. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని కెమ్మరంపాళయం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని, వాడి గ్రామాల్లోకి అటవీ జంతువులు రాకుండా ఆపుతున్నారు. ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తోంది.
ఏఐ కమెరా, లౌడ్ స్పీకర్‌తో అట్టుకట్ట!
గ్రామ పరిసరాల్లోకి ఏనుగుల ప్రవేశ ప్రదేశాన్ని గుర్తించేందుకు నిఘా కెమెరాతోపాటు లౌడ్‌స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అటవీ జంతువులకు సంబంధించిన 25 లక్షల ఫొటోలు ఏఐ సర్వర్‌లో అప్లోడ్ చేశారు. AI- పవర్డ్ కెమెరా ఉంచిన ప్రాంతానికి 500 మీటర్లలోపు వన్యప్రాణుల సంచారం కనిపిస్తే, నిఘా కెమెరా ముందుగా ఆ వన్యప్రాణుల ఫోటో తీసి AI సర్వర్‌కు పంపుతుంది. అనంతరం అది ఏరకమైన అడవి జంతువో AI కెమెరా గుర్తుపడుతుంది. వెంటనే అంబులెన్స్ సైరన్ మోగించడం, గిరిజనుల అరుపులు, జేసీబీ యంత్రం నడుపుతున్న శబ్దం సహా పలు రకాల శబ్ధాలను లౌడ్‌స్పీకర్ వినిపిస్తుంది. ఆ శబ్ధాలకు బయపడి వన్యప్రాణులు గ్రామంలోకి రాకుండా పారిపోతున్నాయి.
'వన్యప్రాణుల రాక తగ్గింది'
కెమ్మరంపాళయంలో ఏఐ పరీక్ష విజయవంతమైందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ''గ్రామంలోకి ప్రతిరోజు ఏనుగులు రావడం వల్ల వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. అధికారుల సూచన మేరకు ప్రైవేట్ సంస్థ సహకారంతో మొదటిసారిగా ఈ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని వినియోగించాం. ఏఐ టెక్నాలజీ ద్వారా ఏనుగులు గ్రామంలోకి రాకుండా అడ్డుకట్టపడింది అని" కెమ్మరంపాలెం పంచాయతీ కౌన్సిల్ సభ్యుడు తెలిపారు.
శాటిలైట్ మ్యాపింగ్
"తమిళనాడు అటవీశాఖ సహకారంతో ఏఐ టెక్నాలజీ ఉపయోగించాం. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి 25 లక్షల ఫొటోలను అప్ లోడ్ చేశాం. ఏనుగులతో పాటుగా ఎలాంటి జంతువులు కెమెరా కంటపడినా వెంటనే శబ్దాలు ప్రారంభం అవుతాయి. కెమ్మరంపాళయంలో మా ప్రయత్నం విజయవంతం అయ్యింది. ఇక కోయంబత్తూర్, వెల్లూరులో ఏఐ టెక్నాలెజీని వాడుతాం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నిరంతర అటవీ జంతువుల కదలికను పర్యవేక్షించాలని నిర్ణయించాం. అటవీ పరిసర ప్రాంతాల్లోకి వచ్చే జంతువులను తరిమికొట్టడానికి తక్కువ ధరలో AI సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము" అని ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాఘవేందర్ తెలిపారు.
ఫారెస్ట్ ఆఫీసర్
ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు మొదటి సారి ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు కోయంబత్తూర్ జిల్లా అటవీ అధికారి జయరాజ్ తెలిపారు. మధుకరై ఫారెస్ట్రీలో ఈ సాంకేతికతను వాడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చిందని వెల్లడించారు. దీంతో మరికొన్ని ప్రాంతాల్లో టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించినట్లు జయరాజ్ తెలిపారు.
కజిరంగలో 30ఏనుగుల జలకాలాట- వరదల తగ్గుముఖంతో సందడి- వీడియో చూశారా! - Kaziranga Elephants Video