Modi Swachh Bharat : ప్రజారోగ్యం విషయంలో 'స్వచ్ఛ భారత్' ఒక గేమ్ ఛేంజర్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శిశువుల, పిల్లల మరణాలను తగ్గించడంలో సరైన శౌచాలయాల పాత్ర ఎంతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ద్వారా విప్లవాత్మక మార్పును చూడగలమని అభిప్రాయపడ్డారు. 'స్వచ్ఛ భారత్‌లో భాగంగా శౌచాలయాల నిర్మాణం - శిశు మరణాలు' అనే అంశంపై బ్రిటిష్ సైంటిఫిక్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన అధ్యయనాన్ని గురువారం ప్రధాని ఎక్స్ వేదికలో పంచుకున్నారు. స్వచ్ఛ భారత్ ప్రయోజనాలను అధ్యయనం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.
శౌచాలయాలతో ప్రాణరక్షణ
దేశంలో చిన్నారుల మరణాలను తగ్గించడంలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో భాగంగా నిర్మించిన శౌచాలయాలు (టాయిలెట్స్) గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఆహార పాలసీ పరిశోధక సంస్థ చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. ఈ సంస్థ మన దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 600 జిల్లాల్లో 2000-2020 సంవత్సరాల మధ్య నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలను, ఇతర గణాంకాలను అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం, 'ఒక జిల్లావ్యాప్తంగా 10% మరుగుదొడ్లను అదనంగా నిర్మిస్తే శిశు మరణాలు 0.9%, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 1.1% మేర తగ్గాయి. దేశంలో 2014 అక్టోబరు 2న ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 2024 జులై వరకు దాదాపు 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు. వీటి కారణంగా వ్యక్తిగత పారిశుద్ధ్యం బాగా పెరిగింది. ఫలితంగా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. దీనితో ఏటా 60,000-70,000 మంది పిల్లల ప్రాణాలు నిలిచాయి. అంతేకాదు మరుగుదొడ్లను నిర్మించుకున్న ప్రతి కుటుంబం, ఆసుపత్రి ఖర్చులు తగ్గడం వల్ల ఏడాదికి రూ.50వేల వరకు లబ్ధి పొందింది.' అందుకే ఇలాంటి వినూత్న విధానాలను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించాలని సదరు అధ్యయనం సూచించింది.
2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్
ఇదే వేగం, పరంపర కొనసాగితే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యమైన 500 గిగా వాట్లను 2030కల్లా సాధించగలమని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో 32 రెట్లు అధిక సామర్థ్యాన్ని సాధించామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర పండగ సందర్భంగా గురువారం ఆయన ఒక వీడియో సందేశమిచ్చారు. 'గత కొన్నేళ్లుగా హరిత ఇంధన ఉత్పత్తి కోసం విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం. పునరుత్పాదక ఇంధన లక్ష్యాల్లో భాగంగా పారిస్ ఒప్పందాన్ని చేరుకున్న తొలి జీ-20 దేశంగా ఇండియా నిలిచింది. సౌర విద్యుత్‌లో అసాధారణ విజయం సాధించడం ఇందులో కీలకమైన అంశం' అని ప్రధాని మోదీ అన్నారు. వేదాల్లోనే సౌర ఇంధన ప్రాముఖ్యం గురించి ఉందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.