Supreme Court On Sanatan Dharma Row : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారని ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్నాళ్ల కిందట సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటిని కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది.
'భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు' అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.
గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.
ఇండియా కూటమిపై ప్రధాని విమర్శలు
PM Modi on Sanatana Dharma : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఇండియా కూటమి నేతలు అనుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్నాళ్ల క్రితం ధ్వజమెత్తారు. స్వామి వివేకానంద, లోకమాన్య బాలగంగాధర్ తిలక్లకు స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో బినాలో బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ అహంకారపూరిత ఇండియా కూటమిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.