Supreme Court On Sambhal Row : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో శాంతిభద్రతలు పరిరక్షించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా మందిరంలో సర్వేకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని సంభాల్ ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే చేయాలని ట్రయల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.
ఓ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను మూడు పని దినాల్లోగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు విచారణ చేపట్టి సర్వే విషయంలో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే వరకు ట్రయల్ కోర్టు ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లదని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.
'న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాం'
సంభాల్ ఘటనపై న్యాయపరమైన దర్యాప్తును కోరుకుంటున్నామని సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయమైన విచారణ జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు, సంభాల్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహ్మూద్ గుర్తుచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ జైన్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ప్రజలను తమ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయమని ఇప్పటికే చెప్పినట్లు వెల్లడించారు. న్యాయపరమైన విచారణను కోరుతున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi | On Sambhal incident, Samajwadi Party MP Dimple Yadav says, " we want a fair investigation. this is an important issue. i am hopeful that there will be a fair investigation under the supervision of the supreme court..." pic.twitter.com/9ss9TT9qaD
— ANI (@ANI) November 29, 2024
#WATCH | On violence following survey at Shahi Jama Masjid, Sambhal MLA Iqbal Mehmood says, " i have heard that the next date of hearing is 8th january 2025 (in shahi jama masjid survey case). we have appealed to the people of sambhal to offer namaz at their respective places. the… pic.twitter.com/DMh4K6uRpv
— ANI (@ANI) November 29, 2024
సంభాల్‌లో ఓ ప్రార్థనా మందిరాన్ని సర్వే చేయాలంటూ నవంబర్ 19వ తేదీన ట్రయల్ కోర్టు ఆదేశించింది. సర్వే కొనసాగుతున్న సమయంలో నవంబర్ 24న అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.