Jagan Illegal Assets Case : జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం జరగడానికి బాధ్యులెవరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందుకు బాధ్యత సీబీఐది కాకపోతే ఇంకెవరిదని నిలదీసింది. రోజువారీ విచారణ జరుగుతున్నట్లు చెబుతున్నా, ఇంతవరకూ ఎలాంటి పురోగతి ఎందుకు కనిపించడంలేదని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటివరకూ ఒక్క డిశ్చార్జి పిటిషన్‌పై అయినా విచారణ ముగించారా అని న్యాయమూర్తి అడిగారు. వాటికి ఎందుకంత సమయం పడుతోందని ప్రశ్నించారు. ఇలాంటి కేసుల డిశ్చార్జి పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం వెలువరించాలన్నారు. అనుమానం ఉంటే డిశ్చార్జి చేయొద్దని చట్టం అదే చెబుతోంది కదా అని సీబీఐ, జగన్ తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా వ్యాఖ్యానించారు. కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచారణపై ప్రభావం చూపుతున్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తాతో కలసి విచారణ చేపట్టిన సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
Supreme Court Hearing Jagan Illegal Assets Case : ఈ కేసులో తొలుత జగన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేయడానికి రఘురామకృష్ణరాజుకు ఉన్న అర్హతేంటని ప్రశ్నించారు. అందుకు జస్టిస్ సంజీవ్‌ఖన్నా స్పందిస్తూ ఆ విషయాన్ని తాము రికార్డులో నమోదు చేశామని, అయినా ట్రయల్ కోర్టులో విచారణ సాగట్లేదు కదా అని అన్నారు. ప్రజాప్రతినిధులపై కేసులను వేగవంతంగా విచారించాలని వాటి పురోగతిని హైకోర్టులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం గత ఏడాది నవంబర్ 9న జారీ చేసిన ఉత్తర్వులను సుమోటోగా తీసుకుని తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 15న ఒక ఉత్తర్వు జారీ చేసిందని ముకుల్ రోహత్గీ తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ముగించాలని ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిపై డిసెంబర్ 15 నుంచి రెండు నెలల్లోపు విచారణ ముగించాలని ట్రయల్ కోర్టును ఆదేశించిందని చెప్పారు. అది తమ పిటిషన్లకూ వర్తిస్తుందని ముకుల్ రోహత్గీ అన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంలో రఘురామ పిటిషన్
జగన్ తరఫున రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని మూడేళ్లుగా ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారిస్తున్నట్లు చెప్పారు. ఆ వాదనలతో జస్టిస్ సంజీవ్‌ఖన్నా ఏకీభవించలేదు. అలాగైతే ఏం పురోగతి జరిగిందని అడిగారు. ఒక్క డిశ్చార్జి పిటిషన్‌పై విచారణైనా ముగించారా అని ప్రశ్నించారు. ఎంత సమయం తీసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు. విచారణ రెండు నెలల్లో ముగించాలని హైకోర్టు చెప్పినట్లు ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. డిశ్చార్జి పిటిషన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సులభమని ఇలాంటి స్వభావం ఉన్న కేసుల్లో ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనుమానం ఉంటే డిశ్చార్జి చేయొద్దని చట్టం అదే చెబుతోందని జస్టిస్ ఖన్నా వివరించారు. తమ డిశ్చార్జి పిటిషన్లపై విచారణను ట్రయల్ కోర్టు ఈసారి ముగిస్తుందని రోహత్గీ బదులిచ్చారు.
ఏదైనా ఒక కేసులో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత వ్యక్తి ప్రమేయం ఉంటే విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న వాదనతో తాను, జస్టిస్ దీపాంకర్ దత్తా ఏకీభవించబోమని అది ఆమోదయోగ్యం కాదని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. అదే సమయంలో కేసులో విచారణ సుదీర్ఘంగా సాగితే వాటి పరిస్థితిలో ఏలాంటి పరిణామాలు ఉంటాయని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇక జాప్యం జరగకపోవచ్చంటూ ఈ కేసుల విచారణను మూడు నెలలు వాయిదావేయాలని ముకుల్ రోహత్గీ కోరారు. ఆలోపు డిశ్చార్జి పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారో లేదో చూసి తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనానికి విన్నవించారు. మరోవైపు ఈ కేసులు దాఖలు చేయడానికి పిటిషనర్‌కు ఉన్న అర్హతపైన తమకు అభ్యంతరాలున్నాయని అయితే ఆ విషయాన్ని సుప్రీంకోర్టు రికార్డు చేసినందున తాము తదుపరి ముందుకు వెళ్లట్లేదన్నారు. అయితే ఇద్దరి మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోందని చెప్పారు. క్రిమినల్ కేసులను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం అంతకుమించి వెళ్లకూడదని జస్టిస్ ఖన్నా అన్నారు. ముకుల్ రోహత్గీ వాదనలు కొనసాగిస్తూ రాజకీయ వివాదంతోనే 8 ఏళ్ల కింద మంజూరు చేసిన బెయిల్ రద్దు కోరుతున్నారని చెప్పారు. అది బెయిల్ రద్దు గురించి కాదు. 205 సార్లు మినహాయింపు ఇవ్వడంపై అని అందుకే తాము నోటిసులిచ్చామని జస్టిస్ ఖన్నా వివరించారు.
Jagan Illegal Assets: వాన్‌పిక్ కేసు.. జప్తు చేసిన భూముల విడుదల.. ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం ఈ కేసుల విచారణ తెలంగాణలో జరుగుతోందని అది వేరే రాష్ట్రమని చెప్పారు. ముఖ్యమంత్రి అధికార పరిధిలోకి రాదని పేర్కొన్నారు. పైగా మూడేళ్లుగా ఈ కేసుల విచారణ జరుగుతోందని ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు విచారణ జరుగుతోందని తెలిపారు. అందువల్ల ముఖ్యమంత్రి రోజూ వాటికి హాజరుకాలేరన్నారు. పిటిషనర్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ రాజకీయ పార్టీగా తాము పిటిషన్ దాఖలు చేశామని అందుకే ఆయన ఈ కేసు వేశారని వాదించారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీనిని పరిగణనలోకి తీసుకున్నందున పిటిషనర్‌ను పక్కనపెట్టి ఈ కేసును కోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సంజీవ్‌ఖన్నా ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపిస్తూ నిందితుడితో సీబీఐ కుమ్మక్కైందని అందుకే వాళ్లు ఏ వాయిదాకూ అభ్యంతరం చెప్పలేదన్నది ప్రధాన ఆరోపణగా చెప్పారు. ఆ వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఖండించారు. ప్రతివాది న్యాయవాదులు వాయిదా కోరినప్పుడు తాము అభ్యంతరం చెప్పనంత మాత్రనా కుమ్మక్కైనట్లు కాదన్నారు. దాంతో జస్టిస్ సంజీవ్‌ఖన్నా తెలంగాణ హైకోర్డు డిసెంబర్ 15న జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని ఈ కేసు విచారణను ఏప్రిల్ తొలి అర్ధభాగానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ - కొలిక్కి వచ్చిన వాదనలు