Srikala Reddy Loksabha Polls 2024 : ఉత్తర్‌ప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల బరిలో ఓ తెలుగు వనిత పోటీ చేస్తున్నారు. ఆమె పేరే శ్రీకళారెడ్డి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున జౌన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. జౌన్‌పుర్ పరిధిలో శ్రీకళారెడ్డికి బలం, బలగం అన్నీ ఆమె భర్తే. శ్రీకళారెడ్డి భర్త పేరు ధనంజయ్ సింగ్. ఆయన మాజీ ఎంపీ. స్థానికంగా బాహుబలి నేతగా, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సన్నిహితుడిగా ధనంజయ్ సింగ్‌కు పేరుంది.
కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు బ్యాన్ విధించింది. దీంతో జౌన్‌పుర్ లోక్‌సభ టికెట్‌ను ధనంజయ్ సింగ్ సతీమణి శ్రీకళారెడ్డికి మాయావతి కేటాయించారు. శ్రీకళా రెడ్డికి బీఎస్పీ టికెట్ దక్కడం వల్ల జౌన్‌పుర్ లోక్‌సభ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్ కుష్వాహా బరిలోకి దిగారు.
తెలంగాణ టు యూపీ
ఇద్దరు మాజీ మంత్రులను ఢీకొనే సత్తా శ్రీకళారెడ్డికి ఉందా? అంటే ఉందని చెప్పొచ్చు. ఆమె తండ్రి దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత జితేందర్ రెడ్డి. నిప్పో బ్యాటరీల కంపెనీ వీరి కుటుంబానిదే. జితేందర్ రెడ్డి తెలంగాణలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. నిప్పో బ్యాటరీస్ వ్యాపారాన్ని వీరి కుటుంబం మొదటి నుంచి చెన్నై కేంద్రంగానే నడుపుతుంటుంది.
అందుకే శ్రీకళారెడ్డి బాల్యం కూడా చెన్నైలోనే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా, బీకామ్ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.
కట్ చేస్తే 2017 సంవత్సరంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చాలా సింపుల్‌గా మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్‌ను శ్రీకళారెడ్డి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇండియాకు వచ్చి చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు నటుడు అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు.
పెళ్లి తర్వాతే రాజకీయాల్లోకి!
బీఎస్పీ అభ్యర్థి శ్రీకళా రెడ్డి ధనంజయ్ సింగ్‌కు మూడో భార్య. ఆయన మొదటి భార్య పెళ్లయిన 9 నెలల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఇక రెండో భార్య పేరు డాక్టర్ జాగృతి సింగ్. తన పనిమనిషిని హత్య చేశారనే అభియోగాలను ఆమె ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జాగృతి సింగ్ నుంచి ధనంజయ్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఏదిఏమైనప్పటికీ పెళ్లి తర్వాత శ్రీకళా రాజకీయాల్లోకి వచ్చారు. 2021లో జౌన్‌పుర్‌లోని 45వ వార్డు నుంచి పంచాయతీ సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. శ్రీకళా మామ, ధనంజయ్ సింగ్ తండ్రి రాజ్‌దేవ్ సింగ్ కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు.
ఆస్తుల లెక్క ఇదీ!
ధనంజయ్ సింగ్‌కు భారీగానే ఆస్తులు ఉన్నప్పటికీ శ్రీకళారెడ్డి కంటే తక్కువే. ఆమె పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్లు విలువైన ఆభరణాలు కూడా ఆమె వద్ద ఉన్నాయి. ఇక భర్త ధనంజయ్ సింగ్ వద్ద రూ.3.56 కోట్ల చరాస్తులు, రూ.5.31 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
రణదీప్ సూర్జేవాలాపై ఈసీ నిషేధం- హేమమాలినిని అలా అనడమే కారణం - LOK SABHA ELECTIONS 2024
'మీరేం అమాయకులు కాదు'- పతంజలి కేసులో రాందేవ్ బాబాపై సుప్రీం ఆగ్రహం - Patanjali Misleading Ads Case