Sri Rama Navami Special Food : సీతారాముల కల్యాణ వేడుక 'శ్రీరామనవమి'(Sri Rama Navami 2024)కి సర్వం సిద్ధమైంది. ఊరు వాడ పల్లె పట్ణణం అనే తేడా లేకుండా దేశంలోని అన్ని రామాలయాలూ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. హిందువులకు అత్యంత శుభప్రదమైన ఈ రోజున ఆ శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు వంటి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే.. ఇవే కాకుండా మరికొన్ని ప్రసాదాలు కూడా తయారు చేయొచ్చు. అవేంటో.. ఎలా ప్రిపేర్ చేయాలో.. ఇక్కడ చూడండి.
కార్న్ క్యాబేజీ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- మినప్పప్పు- కప్పు
- క్యాబేజీ తరుగు- కప్పు
- స్వీట్‌కార్న్- అరకప్పు
- అల్లం తరుగు- చెంచా
- పచ్చిమిర్చి- రెండు
- ఉప్పు- తగినంత
- నూనె- వేయించేందుకు సరిపడా
- కొత్తిమీర- కట్ట
- జీలకర్ర- అరచెంచా
- కారం- అరచెంచా
కార్న్ క్యాబేజీ వడ తయారీవిధానం :
ముందుగా మినప్పప్పును నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లను పూర్తిగా వంపేసి.. పప్పును మిక్సీలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గారెల పిండిలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి బరకగా దంచిన స్వీట్‌కార్న్, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి నూనె వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా పిండిని తీసుకుని ప్లాస్టిక్ కవరు మీద వడలా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అంతే ఇలా సింపుల్‌గా కార్న్ క్యాబెజీ వడను ప్రిపేర్ చేసుకోవచ్చు.
రవ్వ అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- బొంబాయిరవ్వ- కప్పు
- చక్కెర- కప్పు
- నూనె- వేయించేందుకు సరిపడా
- యాలకులపొడి- అరచెంచా
- నీళ్లు- కప్పు
రవ్వ అప్పాలు తయారీవిధానం :
స్టౌ మీద కడాయి పెట్టి వాటర్ పోయాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు రవ్వ, యాలకులపొడి వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక షుగర్, రెండు చెంచాల నెయ్యి వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. షుగర్ పూర్తిగా కరిగి.. హల్వాలా అయ్యాక దింపేయాలి. ఈ మిశ్రమం వేడి కొద్దిగా చల్లారుతున్నప్పుడు మళ్లీ ఒకసారి కలిపి చిన్నచిన్న అప్పాల్లా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వేడివేడి నూనెలో రెండుమూడు చొప్పున వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా రవ్వ అప్పాలను రెడీ చేసుకోవచ్చు.
రేపే శ్రీరామనవమి - స్వామి ప్రసాదం పానకం, వడప్పు ఇలా తయారు చేయండి - SRI RAMA NAVAMI NAIVEDYAM RECIPES
కోసంబరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- నానబెట్టుకున్న పెసరపప్పు-కప్పు
- కీరదోస- రెండు (తురమాలి)
- క్యారెట్లు- నాలుగు (తురమాలి)
- మామిడికాయ- ఒకటి (సన్నగా తరగాలి)
- కొబ్బరితురుము- అరకప్పు
- ఆవాలు- చెంచా
- సెనగపప్పు- చెంచా
- మినప్పప్పు- చెంచా
- కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు
- కరివేపాకు రెబ్బలు- రెండు
- పచ్చిమిర్చి- నాలుగు
- నూనె- రెండు చెంచాలు
- ఇంగువ- పావుచెంచా
- నిమ్మరసం- ఒకటిన్నర చెంచా
- ఉప్పు- తగినంత
కోసంబరి తయారీవిధానం :
ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు లేకుండా చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పులోకి తరిగిన కీరదోస, క్యారెట్, మామిడికాయ, కొబ్బరితురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఆయిల్ వేసుకుని అందులోకి తాలింపు దినుసులు, కట్ చేసిన మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఈ తాలింపును కోసంబరి మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ కోసంబరి రెడీ. ఈ నవమి స్పెషల్ నైవేద్యాలు మీరూ తయారు చేయండి. స్వామి వారికి సమర్పించండి.
శ్రీరామనవమి స్పెషల్ - మీ ఆత్మీయులకు ఇలా విషెస్ చెప్పండి! - Sri Rama Navami Wishes and Quotes