Special Hospital For Birds In Delhi : పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులే కాదు పక్షులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. తాగడానికి నీరు లభించక, వేడి గాలుల కారణంగా వడదెబ్బకు గురవుతున్నాయి. ఇలాంటి పక్షుల కోసం ఓ ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
వేడి గాలుల తీవ్రతకు ఇబ్బందిపడుతున్న పక్షుల సంరక్షణకు, దిల్లీలోని చాందినీ చౌక్‌లో ఉన్న ఛారిటీ బర్డ్స్ హాస్పిటల్ నడుం కట్టింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వ్యాధుల బారిన పడి ఆస్పత్రికి వచ్చిన పక్షులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పక్షుల కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు వైద్యులు.
"నేను హరావతార్ సింగ్. ఇక్కడ సీనియర్ వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్నాను. దిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మా వద్దకు పక్షుల కేసులు రావడం ప్రారంభమైంది. ఎండలు పెరుగుతున్నకొద్దీ పక్షులు వడదెబ్బ బారిన పడుతున్నాయి. తద్వారా వాటికి వ్యాధుల వస్తున్నాయి. ఈ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. మా ఆస్పత్రికి వచ్చిన కొన్ని పక్షులు వడ దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి."
-- హరావతార్ సింగ్, సీనియర్ డాక్టర్
ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో సగటున ప్రతిరోజు 5 నుంచి 15 పక్షులు తమ ఆస్పత్రికి వస్తాయని డాక్టర్ హరావతార్ సింగ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం తమ బర్డ్స్ హాస్పిటల్లో వివిధ వ్యాధులతో బాధపడుతున్న 30 నుంచి 40 పక్షులు ఉన్నాయని తెలిపారు డాక్టర్.
"వడదెబ్బతో మా ఆస్పత్రికి వచ్చిన పక్షులపై మొదటగా నీళ్లను స్ప్రింకిల్ చేస్తాము. దాంతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్లతో సరైన వెంటిలేషన్ కల్పిస్తాము. అంతేకాకుండా ఆస్పత్రిలో ఉన్న పెద్ద ఫ్యాన్లతో చల్లని గాలి ఇస్తాము. తద్వారా పక్షుల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది."
-- హరావతార్ సింగ్, సీనియర్ డాక్టర్
పక్షుల శరీర ఉష్ణోగ్రత సహజంగానే 107 డిగ్రీల ఫారన్‌హీట్ ఉంటందన్న హరావతార్ టెంపరేచర్ 110 డిగ్రీల ఫారన్‌హీట్ దాటితే పక్షుల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. అప్పుడు పక్షులు బతకడానికి వాటికి తక్షణ సహాయం, ఇంటెన్సివ్ కేర్ అవసరమవుతుందని తెలిపారు.