Center On Bihar Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని లోక్‌సభలో కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్‌లో భాగమైన జేడీయూ, బిహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బిహార్‌కు ప్రత్యేక హోదాపై జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ ఛౌదరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా సోమవారం వెల్లడించారు.
"ప్రత్యేక కేటగిరీ హోదాను గతంలో జాతీయ అభివృద్ధి మండలి (NDC) కొన్ని రాష్ట్రాలకు మంజూరు చేసింది. 1. కొండలు, పర్వత ప్రాంత భూభాగం 2. తక్కువ జన సాంద్రత, జనాభాలో గిరిజనుల శాతం ఎక్కువగా ఉండడం 3. అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉండడం, 4. ఆర్థిక, మౌళిక వసతుల లేమి ఉన్న రాష్ట్రం, 5. ఆర్థిక పరిస్థితి దిగజారిన రాష్ట్రాలు. ఇలా పైన పేర్కొన్న అన్ని అంశాల సమగ్ర పరిశీలన ఆధారంగా ప్రత్యేక హోదా కోసం బిహార్ చేసిన అభ్యర్థనను ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (IMG) పరిశీలించింది. ఈ క్రమంలో తన నివేదికను 2012 మార్చి 30న సమర్పించింది. ఇప్పటికే ఉన్న జాతీయ అభివృద్ధి మండలి ప్రమాణాల ఆధారంగా బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేం." అని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ ఛౌదరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
The Special Category Status for plan assistance was granted in the past by the National Development Council (NDC) to some States that were characterized by a number of features necessitating special consideration.
— ANI (@ANI) July 22, 2024
The decision was taken based on an integrated consideration of… pic.twitter.com/PbPDiJjLyz
అంతకుముందు బిహార్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండింటిని ఇవ్వాలని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా ఆదివారం డిమాండ్ చేశారు. బిహార్, ఝార్ఖండ్ విభజన జరిగినప్పటి నుంచి బిహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మరోవైపు, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ, బీజేడీ డిమాండ్ చేశాయి.
'లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చేశారు- ఈ బడ్జెట్ దానికోసమే!' - Parliament Budget Session 2024