Sonia Gandhi Rajya Sabha : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు ఆమె నామినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. హిమాచల్ ప్రదేశ్ లేదా రాజస్థాన్ నుంచి పోటీ పెద్దల సభకు సోనియా బరిలో నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ఆమె కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు సమాచారం.
అనారోగ్య సమస్యల కారణంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయటం లేదని తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తే 2004 నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అవుతుంది. దీంతో ఆ స్థానం నుంచి లోకసభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మేరకు రాజ్యసభ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సోమవారం దిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఒకవేళ ఈ ఊహాగానాలు నిజమైతే ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచే స్థానం ఇదే కానుంది. రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న సీటు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంతో అమేఠీలో రాహుల్ ఓటమి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా రాయ్‌బరేలీలో మాత్రం కాంగ్రెస్ తట్టుకొని నిలబడింది.
ఎన్నో ఏళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్న ప్రియాంక గాంధీకి ఇది సురక్షితమైన సీటుగా హస్తం పార్టీ భావిస్తోంది. 1950ల నుంచి ఇది కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తోంది. తొలుత ప్రియాంక గాంధీ తాత ఫిరోజ్‌గాంధీ ఇక్కడి నుంచే విజయం సాధించారు. 2019 జనవరిలో అధికారికంగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక, ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీ చేస్తారని అందరూ భావించారు. వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీతో తలపడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆ సమయంలో పార్టీకి సారథ్యం వహించిన రాహుల్‌గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను ఆమెకు అప్పగించారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. అయితే, సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారనే అంశంపై ఇప్పటివరకు ఊహాగానాలే వినిపిస్తున్నాయి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
మధ్యప్రదేశ్ నుంచి సోనియా రాజ్యసభకు ప్రాతినిధ్యం
మరోవైపు సోనియాగాంధీ తమ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇటీవల మాజీ సీఎం కమల్‌నాథ్ ఆమెను దిల్లీలో కలిసి తమ పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ సోమవారం తెలిపారు. గతంలో ప్రధాని పదవిని తిరస్కరించిన సోనియా, ఇక్కడినుంచి రాజ్యసభకు వెళ్తే ప్రజల గొంతుక బలపడుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ కమల్‌నాథ్‌కు రాజ్యసభ సభ్యుడిగా ఆసక్తి ఉంటే తాము మద్దతిస్తామని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఐదు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నాలుగు సీట్లలో బీజేపీ పోటీ చేస్తుండగా ఒకచోట ప్రతిపక్ష కాంగ్రెస్ బరిలో నిలుస్తోంది.
రైతులతో కేంద్ర మంత్రుల భేటీ- 'దిల్లీ చలో' విరమించుకోవాలని విజ్ఞప్తి!