Simultaneous Polls High Level Committee Report : 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచాలని న్యాయ మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా కేబినెట్‌కు నివేదికను సమర్పించాలనుకుంటున్నట్లు చెప్పాయి. ఇది న్యాయ మంత్రిత్వ శాఖ లెజిస్లేటివ్ విభాగం 100రోజుల అజెండాలో భాగమే అని వెల్లడించాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, తదుపరి ప్రభుత్వం కోసం 100రోజుల అజెండాను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించారు.
రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో గతేడాది ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ, తన నివేదికను మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అందులో, మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అనంతరం 100రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలను సూచించింది. అంతేకాకుండా ఈ సిఫారసుల అమలును పరిశీలించేందుకు ఒక 'అమలు బృందం' నియమించాలని ప్రతిపాదించింది. వనరులను ఆదా చేయడం, అభివృద్ధి, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బలంగా చేయడం, దేశ ఆకాంక్షలను సాకారం చేయడంలో ఈ జమిలి ఎన్నికలు సహాయపడతాయని కమిటీ నివేదికలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడం కోసం 18 రాజ్యాంగ సవరణలను ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయితే అందులో చాలా వరకు సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఈ సవరణల్లో కొన్నింటిని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇక ఒకే ఓటర్ జాబితా, ఒకే ఓటరు ఐడీ కార్డుకు సంబంధించి కమిటీ ప్రతిపాదించిన మార్పులకు కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం.
ఇదిలా ఉండగా జమిలి ఎన్నికల విషయమై లా కమిషన్ కూడా సొంతంగా ఓ నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటి స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రతిపాదించే అవకాశం ఉందని సమాచారం.
'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 2023 సెప్టెంబర్‌లో ఎనిమిది మంది నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు చోటు కల్పించింది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.
వయనాడ్‌కు రాహుల్ బై, రాయబరేలీకి జై?- ఉపఎన్నికకు ప్రియాంక సై! - Priyanka Gandhi Lok Sabha