Sidhu Moose Wala Mother Pregnancy : దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు త్వరలోనే తమ కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆయన తల్లి చరణ్ కౌర్ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారట. ఈ మేరకు కుటుంబ వర్గాలు తెలిపినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు ఆయనను అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ కుమారుడు సిద్ధూ మూసేవాలా మరణించినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. సిద్ధూ మూసేవాలా హత్యకు గురవ్వడం ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సుమారు 2 ఏళ్ల తరువాత సిద్ధూ తల్లి మరో చిన్నారికి జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మరి కొద్ది నెలల్లో సిద్ధూ మరో చిన్నారికి సోదరుడు కానున్నారు.
అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన సిద్ధూ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. మార్చిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కౌర్ వయసు 58 ఏళ్లు కాగా, సిద్ధూ తండ్రి బాల్‌కౌర్ సింగ్ వయసు 60ఏళ్లు.
సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ 2021 డిసెంబరులో కాంగ్రెస్‌లో చేరారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తేరీ మేరీ జోడీ', 'మోసా జఠ్' లాంటి చిత్రాల్లోనూ నటించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సిద్ధూ తండ్రి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
డ్రైవర్ లేకుండా రైలు పరుగులు- పొరపాటు జరిగింది అక్కడే- ఆరుగురిపై వేటు
గ్రాండ్గా రోడ్డు పెళ్లి- విందులో బిర్యానీ, స్వీట్లు- అందుకోసమేనట!