Sidhu Moose Wala Mother Delivery : దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. అలాగే ఆ చిన్నారి ఫొటోను కూడా షేర్ చేస్తూ సిద్ధూ తమ్ముడిని ఆశీర్వదించాలని పోస్ట్ చేశారు. 58ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చారు సిద్దు తల్లి.
ఐవీఎఫ్ ద్వారా గర్భం
'సిద్ధూను అభిమానించే లక్షలాది మంది ఆశీస్సుల వల్ల ఆ దేవుడు మాకు మగ బిడ్డను ఇచ్చాడు. మీ ఆశీస్సులతో మా కుటుంబ ఆరోగ్యంగా ఉంది. మాపై మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు' అని సిద్ధూ తండ్రి ఇన్స్టాగ్రామ్ వేదిక వెల్లడించారు. అయితే, బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్‌కు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన సిద్ధూ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు గతంలో ఆమె సోదరుడు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు.
2022లో సిద్దూ హత్య
సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు ఆయనను అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ కుమారుడు సిద్ధూ మూసేవాలా మరణించినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. సిద్ధూ మూసేవాలా హత్యకు గురవ్వడం ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ 2021 డిసెంబరులో కాంగ్రెస్‌లో చేరారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయన పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'తేరీ మేరీ జోడీ', 'మోసా జఠ్' లాంటి చిత్రాల్లోనూ నటించారు.
బీజేపీ ఆకాశంలోకి- కాంగ్రెస్ పాతాళంలోకి! 40 ఏళ్లలో ఎంతో మార్పు
రైలు బోగీలో సిలిండర్లు బ్లాస్ట్- భారీగా ఎగసిపడ్డ మంటలు- లక్కీగా!