Shashi Tharoor On BJP 400 Paar : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400కన్నా ఎక్కువ సీట్లు సాధించడం అనేది ఒక జోక్ అని కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిథరూర్ ఎద్దేవా చేశారు. కనీసం బీజేపీ 300 స్థానాలు సాధించడం కూడా అసాధ్యమని ఆయన చెప్పారు. ఈసారి 200 సీట్లను బీజేపీ దక్కించుకోవడం కూడా పెద్ద సవాలేనని, కేంద్రంలోని మోదీ సర్కారుకు అంతిమ ఘడియలు సమీపించాయని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ సంపాదకులతో మాటామంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. 2019 ఎన్నికల కంటే ఈసారి దక్షిణాదిలో బీజేపీకి అధ్వానమైన ఫలితాలు వస్తాయని థరూర్ చెప్పారు. ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన తిరువనంతపురం స్థానంలో తాను సులువుగా గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
రెండు దశల పోల్స్ తర్వాత ప్రజల మూడ్ ఎలా ఉందనిపిస్తోంది ?
''ఇప్పటివరకు రెండు దశల్లో 190 స్థానాలకే పోలింగ్ జరిగింది. మరో ఐదు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. నా సోర్స్ ప్రకారం ఇండియా కూటమికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. మాకు అనుకూలంగా విపరీతమైన వేవ్ ఉందని నేను చెప్పడం లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ట్రెండ్ లేదని మాత్రం స్పష్టంగా చెప్పగలను. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ క్యాడర్‌లో ఈసారి జోష్, ఎమోషన్ లోపించింది. ఈ మార్పే బీజేపీని దెబ్బతీయబోతోంది" అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చెప్పారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పవనాలు వీయడం మొదలైందన్నారు.
కాంగ్రెస్, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి?
''నేను క్రికెట్ ఫ్యాన్‌లా స్కోర్లను అంచనా వేయను. గెలుపోటములను మాత్రమే అంచనా వేస్తాను. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ ఆరు రాష్ట్రాల్లో సీట్లన్నీ గెల్చుకుంది. మూడు రాష్ట్రాల్లో ఒక్క సీటు తప్ప మిగతావన్నీ గెలిచింది. రెండు రాష్ట్రాల్లో రెండు సీట్లు తప్ప మిగతావన్నీ గెలిచింది. ఇది పునరావృతం కాకపోవచ్చు" అని శశిథరూర్ పేర్కొన్నారు. ''హరియాణాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లేం గెలవలేదు. కానీ ఈసారి అక్కడ మాకు 5-7 సీట్లు వచ్చే సూచనలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మేం కర్ణాటకలో ఒకే సీటును గెలిచాం. ఈసారి అక్కడ 20 వరకు సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు" అని ఆయన విశ్లేషించారు.
ఓటర్లను ప్రభావితం చేస్తున్న అంశాలేమిటి ?
'ఉద్యోగం వస్తుందనే ఆశతో 2014లో బీజేపీకి ఓటేసిన ఓ యువకుడు, పదేళ్ల తర్వాత కూడా తనకు ఉద్యోగం లేనప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తాడు ? గత పదేళ్లలో దేశ జనాభాలో 80 శాతం మంది ఆదాయం తగ్గిపోయిందని ఆర్థికవేత్తలందరూ చెబుతున్నారు. ఈ 80 శాతం మంది తమను దుస్థితిలోకి నెట్టిన బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారు? 2014 ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధిపై ఊదరగొట్టింది. 2019లో పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్‌లను వాడుకుని మోదీ గెలిచారు. ఈసారి అలాంటి అంశాలేవీ బీజేపీకి లేవు" అని శశిథరూర్ విశ్లేషించారు. అయోధ్య రామమందిరం, రిజర్వేషన్ల అంశాలు ఇక బీజేపీకి లబ్ధి చేకూర్చవని అన్నారు. హిందూ, ముస్లింలను విభజించి, ఉద్వేగం పండించి, ఓట్లు అడగడం ద్వారా కాషాయ పార్టీ విజయం సాధించడం అసాధ్యమని చెప్పారు.
కాంగ్రెస్ యువరాజును ప్రధానిని చేయాలని పాక్ తహతహ : మోదీ - Lok Sabha Elections 2024