Shashi Tharoor France Award : ప్రముఖ రచయిత, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. మంగళవారం దిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు జెరార్డ్ లాంచర్ 'చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్'ను శిశిథరూర్‌కు బహూకరించారు. వాస్తవానికి ఆగస్టు 2022లో ఫ్రాన్స్ ప్రభుత్వం శశిథరూర్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే తాజాగా ఈ అవార్డును అందజేశారు. అనేక పుస్తకాల రచయిత అయిన శశిథరూర్ ప్రస్తుతం తిరువనంతపురం లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.
భారత్-ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి, అంతర్జాతీయ శాంతి, సహకారాన్ని పెంపొందించినందుకు, చాన్నాళ్లుగా ఫ్రాన్స్‌కు స్నేహితుడిగా నిలిచినందుకు గుర్తింపుగా శశిథరూర్‌కు పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు ఫ్రాన్స్ రాయబార కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దౌత్యవేత్తగా, రచయితగా, రాజకీయవేత్తగా శశిథరూర్ సేవలు చిరస్మరణీయమని ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు జెరార్డ్ లార్చర్ కొనియాడారు. 'ఫ్రాన్స్‌కు ఆయన (థరూర్) నిజమైన స్నేహితుడు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. ఈ పురస్కారం ఆయనపై ఫ్రాన్స్‌కు ఉన్న స్నేహాన్ని, ప్రేమను సూచిస్తుంది. ప్రపంచ దేశాల అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనం' అని జెరార్డ్ అన్నారు.
ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, తన బాధ్యతను ఇది మరింత పెంచిందని శశిథరూర్ పేర్కొన్నారు. 'ఫ్రాన్స్ ప్రజల భాష, సంస్కృతి, సాహిత్యాలను మెచ్చుకునే వ్యక్తిగా, మీ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కినందుకు ఎంతో గర్వపడుతున్నా. ఈ అవార్డును భారతీయుడికి అందించటం అనేది ఫ్రాన్స్- ఇండియా మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనం. ఇది భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటుంది. ఈ గౌరవం వ్యక్తిగత విజయానికి సంబంధించినది మాత్రమే కాదు. సాంస్కృతిక, దౌత్య సంబంధాలను పెంపొందిచడంలో రెండు దేశాల సమిష్టి కృషిని ప్రతిబింబిస్తుంది. పరస్పరం సహాకారం, గౌరవం, ప్రశంసలు అనే స్తంభాల మీద ఏర్పడిన బంధం ఇది. రెండు దేశాల ఉన్న మధ్య సంబంధాన్ని మరింత బలపరుచుకోవాలి. అలాగే మన ఉమ్మడి ప్రాథమిక విలువలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నాకు ఫ్రెంచ్ ప్రజాస్వామ్యంపై ప్రగాఢమైన గౌరవం ఉంది' అని వ్యాఖ్యానించారు.
గుల్జార్, రామభద్రాచార్యకు జ్ఞాన్‌పీఠ్- ఉర్దూ కవి, సంస్కృత పండితునికి దక్కిన గౌరవం
తొలి 'రైతు' ప్రధాని చౌధరీ చరణ్ సింగ్- జమీందారీ చట్టం రద్దుకు ఎనలేని కృషి