Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణ్‌పుర్- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 36కు చేరినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
బస్తర్ రేంజ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మాడ్ దండకారణ్యంలోని తుల్‌తులి, నెందూర్ గ్రామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎదురు కాల్పులు జరిగిటన్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు. అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
బస్తర్ ప్రాంతంలో 170 మందికి పైగా!
ఈ ఎన్‌కౌంటర్ అనంతరం 30 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో అడపాదడపా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు ఐజీ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో 170 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
17 వేల మంది బలి
మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమన్నారు. 2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఏకకాలంలో భద్రతా కార్యకలాపాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్‌ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మావోయిస్టు హింస నిర్మూలనకు కృషి చేస్తున్నాయని తెలిపారు.