West Bengal Train Accident : బంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్‌పాయ్‌గుడి సమీపంలో కాంచన్‌జంఘూ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15మంది మరణించినట్లు, మరో 60మందికి గాయాలైనట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రమాదంలో 9మంది మృతిచెందారని, మరో 41మందికి గాయాలైనట్లు తాజాగా రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది.
అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా, ఎక్స్‌ప్రైస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ ఏకంగా గాల్లోకి లేచింది. ఈ ఘటనలో 9మంది మరణించారని, 41మంది గాయపడ్డారని రైల్వే శాఖ వివరాలు వెల్లడించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని డార్జిలింగ్ ఎస్పీ చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు దిల్లీలోని రైల్వే అధికారులు ఈ ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
డార్జిలింగ్ రైలు ప్రమాద వార్త చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు తెలిపారు.
స్పందించిన బంగాల్ సీఎం, రైల్వే మంత్రి
బంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పర్యవేక్షించేందుకు అశ్వినీ వైష్ణవ్ బంగాల్‌కు బయలుదేరారు.