SC On Navneet Kaur Caste Certificate : మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నవనీత్ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కనబెట్టింది. అలాగే నవనీత్ కౌర కుల ధ్రువీకరణ పత్రం విషయంలో స్క్రూటినీ కమిటీ నివేదికపై హైకోర్టు జోక్యం చేసుకోరాదని పేర్కొంది. నవనీత్ కౌర్ చట్టవిరుద్ధంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారని, అది చెల్లదంటూ 2021లో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. నవనీత్‌కౌర్‌కు రూ.2 లక్షలు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై నవనీతక్ కౌర్ సుప్రీం కోర్టును ఆశ్రయించి, ఊరట పొందారు.
ఎల్లప్పుడూ న్యాయమే గెలుస్తుందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై నవనీత్ కౌర్ స్పందించారు. 'నా పుట్టుక గురించి ప్రశ్నలు వేసిన వారికి ఈ రోజు సమాధానం వచ్చింది. నేను సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నా. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది. అంబేడ్కర్, ఛత్రపతీ శివాజీ లాంటి గొప్ప వాళ్లు చూపించిన మార్గంలో నడవటం వల్ల విజయం సాధిస్తారు' అని అమరావతి ఎంపీ నవనీత్ అన్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు
2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయ అరంగేట్రం చేశారు నవనీత్ కౌర్. ఎన్సీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివసేన అభ్యర్థి ఆనంద్‌రావ్ అదసూల్ పై విజయం సాధించారు. నవనీత్ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆనంద్‌రావ్ తొలుత ముంబయి జిల్లా కుల ధ్రువీకరణ నిర్ధరణ కమిటీలో ఫిర్యాదు చేశారు. అయితే ఆ కమిటీ నవనీత్ కౌర్‌కే అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద్‌రావ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
బీజేపీ పార్టీలోకి
నవనీత్ కౌర్ ఇటీవలే బీజేపీ చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నవనీత్ కౌర్‌ను బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి బరిలోకి దించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాలో పేరు ప్రకటించగానే నవనీత్ కౌర్ పార్టీ కండువాను కప్పుకున్నారు.
మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు- రాహుల్ గాంధీకి రూ.20కోట్ల ఆస్తులు! - Rahul Gandhi Assets