Satyapal Malik CBI Raids : కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు చెందిన అవినీతి కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహా ఆయన సన్నిహితుల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచే దాదాపు 100 మంది సీబీఐ అధికారులు దిల్లీ సహా 30 నగరాల్లో సోదాల్లో నిమగ్నమయ్యారు. దిల్లీలో ఆర్‌కే పురం, ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో మాలిక్‌తో సంబంధం ఉన్న ప్రాంగణాలతో పాటు గురుగ్రామ్, బాగ్‌పట్‌లలోనూ తనిఖీలు నిర్వహించారు.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ!
అయితే తన నివాసాల్లో సోదాల సందర్భంగా సత్యపాల్ మాలిక్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. "నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను" అని వెల్లడించారు. గతంలో ఓ బీమా పథకం ఒప్పందానికి చెందిన అవినీతి కేసులో సత్యపాల్ మాలిక్‌ను సాక్షిగా ఐదు గంటల పాటు విచారించింది సీబీఐ.
-
.#WATCH | CBI is conducting raids at more than 30 places, including the premises of former Jammu and Kashmir Governor Satyapal Malik, as part of its investigation into alleged corruption linked to the awarding of a Kiru Hydroelectric project contract in the UT: Sources
— ANI (@ANI) February 22, 2024
(Outside… pic.twitter.com/zDM8YixyI4
అప్పట్లో సంచలన వ్యాఖ్యలు
సత్యపాల్ మాలిక్ 2018 ఆగస్టు 23వ తేదీ నుంచి 2019 అక్టోబర్ 30వ తేదీ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే 300 కోట్ల రూపాయలు వస్తాయని తన కార్యదర్శలు చెప్పినట్లు గతంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్-HEPలో పనుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2022 ఏప్రిల్‌లో సత్యపాల్ మాలిక్‌తో సహా ఐదుగురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
అయితే కొన్నిరోజుల క్రితం, ప్రధాని నరేంద్ర మోదీపై సత్యపాల్ మాలిక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ రెండింటినీ నెరవేరుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు సత్యపాల్ మాలిక్. ఆ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశ సైనికుల మృతదేహాలపైనే 2019 ఎన్నికల పోరు: సత్యపాల్ మాలిక్
వారిని టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కేంద్రంపై గవర్నర్ ఫైర్