Safety Tips While Using Gas Geyser : ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో వేడి నీళ్ల కోసం గీజర్‌లను వాడుతున్నారు. కేవలం ఒక్క స్విచ్ వేస్తే చాలు.. హాట్ వాటర్‌తో స్నానం చేసే సౌలభ్యం ఉండటంతో.. వీటి వాడకం పెరిగిపోయింది. అయితే, కొంత మంది కరెంట్ అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో పని చేసే గ్యాస్ గీజర్‌లను ఉపయోగిస్తుంటారు. మీరు కూడా గ్యాస్ గీజర్ వాడుతున్నారా? అయితే.. ఈ స్టోరీ మీకోసమే. ఈ గీజర్‌ను సక్రమంగా వాడకపోతే.. ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సనత్‌నగర్‌లో గ్యాస్ గీజర్‌ని ఉపయోగించే వారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ గీజర్ నుంచి విడుదలైన విష వాయువులు పీల్చడంతో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు.
గ్యాస్ చాలా ప్రమాదం..
కార్బన్ మోనాక్సైడ్ అనేది రంగు, వాసన లేని ఒక వాయువు. ఇది చాలా విషపూరితమైనది. దీనిని పీల్చడం ద్వారా కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. ఈ వాయువు పీల్చడం ద్వారా తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, తలతిప్పడం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సేపు దీనిని పీలిస్తే.. ఏకంగా ప్రాణాలే పోవచ్చు. అందుకే గ్యాస్ గీజర్ వాడేవారు అలర్ట్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి :
- బాత్‌రూమ్‌లో గీజర్ ఉపయోగిస్తున్న వారు తప్పకుండా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ గీజర్‌లను వాడేవారి బాత్‌రూమ్‌లో వెంటిలేషన్ కాస్త పెద్దగా ఉండాలి. ఎందుకంటే.. గీజర్ నుంచి ఏవైనా విషపూరిత గ్యాస్‌లు లీకైతే.. త్వరగా బయటకు వెళ్లిపోతాయి.
- గ్యాస్ గీజర్‌ను వెంటిలేషన్ లేని బాత్రూమ్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దు.
- అలాగే గ్యాస్ గీజర్‌లను వాడేవారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. గీజర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్‌లోనే ఉండాలి. దీనివల్ల విడుదలైన వాయువులు బయటకు వెళ్లిపోతాయి.
- కొంతమంది గీజర్‌లను ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు. కానీ, ఇలా అస్సలు చేయకూడదు. గీజర్ వాడిన తర్వాత బంద్ చేయాలి.
- అలాగే గీజర్‌లను పిల్లలకు అందకుండా.. కాస్త ఎత్తులో అమర్చుకోవడం మంచిది.
- గీజర్ చాలా రోజుల నుంచి సర్వీసింగ్ చేయించకపోతే.. ఒకసారి టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించండి.
- బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు ఊపిరి పీల్చడానికి ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా కూడా.. వెంటనే బయటకు వచ్చేయండి.
- గీజర్ నుంచి వాటర్ లీకవుతున్నాయా ? లేదా ? అని తరచూ చెక్ చేస్తుండాలి. అలాగే ఏదైనా గ్యాస్ లీకవుతున్నట్లుగా అనిపిస్తే.. వెంటనే బాత్‌రూమ్‌లో నుంచి బయటకు రావాలి. ఆ తర్వాత మంచి టెక్నీషియన్‌తో రిపేర్ చేయించాలి.
- కొత్తగా గ్యాస్ గీజర్‌లను కొనుగోలు చేసేవారు మంచి రేటింగ్ ఉన్నవాటిని ఎంపిక చేసుకోండి.
- ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా వరకు గ్యాస్ గీజర్ ద్వారా జరిగే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
వేడి నీటి కోసం హీటర్ వాడుతున్నారా? ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!
బిగ్ అలర్ట్ : హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా? - ఈ విషయాలు తెలిస్తే షాకే!