NEET UG Paper Leak : నీట్ యూజీ ప్రవేశ పరీక్ష పత్రం లీకైనట్లు వస్తున్న వార్తలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ- ఎన్‌టీఏ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. లీక్ అయిన ప్రశ్నాపత్రానివంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలకు, అసలు ప్రశ్నాపత్రానికి సంబంధమే లేదని ఎన్‌టీఏ తేల్చిచెప్పింది.
"నీట్ యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీకైందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం. పరీక్ష పేపర్ లీకైందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పరీక్ష ప్రారంభమైన తర్వాత బయటి వ్యక్తులు ఎవరూ కేంద్రాల్లోకి ప్రవేశించలేరు. పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన తర్వాత సీసీ కెమెరాల నిఘాలో ఉన్న హాళ్లలోకి బయట వ్యక్తులు ఎవరినీ అనుమతించడం లేదు." అని ఎన్‌టీఏ సీనియర్ డైరెక్టర్ సాధనా పరాశర్ సోమవారం తెలిపారు.
అసలేం జరిగిందంటే?
దేశవ్యాప్తంగా 557 నగరాలు/పట్టణాలు, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ క్రమంలో నీట్ యూజీ ప్రవేశ పరీక్ష పత్రం లీకైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
రాజస్థాన్లోని ఓ పరీక్షా కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఆంగ్ల మాధ్యమం ప్రశ్నాపత్రం వచ్చిందని, ఇన్విజిలేటర్ ఆ తప్పును సరిదిద్దేటప్పటికే దాదాపు 120 మంది విద్యార్థులు పరీక్ష హాలు నుంచి క్వశ్చన్ పేపర్తో బలవంతంగా బయటకు వెళ్లిపోయారని ఎన్‌టీఏ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఆ తర్వాత సాయంత్రం 4గంటల సమయంలో పేపర్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసిందని వివరించారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్ష మొదలవడం వల్ల పేపర్ లీక్ అవ్వలేదని, దీని ప్రభావం ఏ కేంద్రంపైనా పడలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఎన్‌టీఏ మరింత స్పష్టత ఇచ్చింది.
తారుమారైన క్వశ్చన్ పేపర్
మరోవైపు, వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష నీట్ ప్రశ్నాపత్నం ఓ పరీక్షా కేంద్రంలోని విద్యార్థులకు మారిపోయింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం(మే 5) నిర్వహించిన నీట్ పరీక్షలో క్వశ్చన్ పేపర్ తారుమారైంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్‌టీఏ అందించిన పేపర్ కాకుండా ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో పరీక్షకు హాజరైన విద్యార్థులకు మరో ప్రశ్నాపత్రం అందించడం వల్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.