Reliance Foundation Vantara : దేశంలోని దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్- సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దానికి 'వన్‌తారా' అని నామకరణం చేసినట్లు తెలిపింది. వన్‌తారా అనేది గాయపడ్డ జంతువులను రక్షించడం, చికిత్స చేయడం, సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాటు చేసిందని పేర్కొంది. మొత్తం 3 వేల ఎకరాల్లో వన్‌తారాను సృష్టించినట్లు రిలయన్స్ ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది.
కొవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు దీన్ని (జంతు సంరక్షణ కేంద్రం) నిర్మాణం ప్రారంభించినట్లు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తెలిపారు. ప్రపంచం కరోనాతో బాధపడుతున్నప్పుడు, తమకు దీని గురించి ఆలోచించే సమయం దొరికిందని వివరించారు. 2008 నుంచే ఇక్కడ ఏనుగుల సంరక్షణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
"చిన్నవయసులో నుంచే నాకు జంతువులను కాపాడడం అభిరుచిగా మారింది. ఇప్పుడు వన్‌తారాను సృష్టించాం. నిబద్ధత కలిగిన మా బృందంతో అది ఒక మిషన్‌గా మారింది. భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపై మేము దృష్టి సారించాము. మా కృషికి భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నాం. భారత్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు కొందరు వన్‌తారా మిషన్‌లో భాగమయ్యారు. ప్రభుత్వ, పరిశోధన సంస్థల సహకారాలు, మార్గదర్శకత్వం పొందడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాం."
-- అనంత్ అంబానీ, వ్యాపారవేత్త
వన్‌తారా అనేది ఒక కృత్రిమ అడవి. గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ ప్రాంతంలోని గ్రీన్ బెల్ట్‌లో 3 వేల ఎకరాల్లో ఈ అడవిని నిర్మించారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. జంతు సంరక్షణ, అంతరించిపోతున్న జాతులను కాపాడడానికి వన్‌తారాను తీసుకొచ్చారు. అలాగే వన్‌తారా అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
జంతువుల ఆరోగ్య సంరక్షణ, ఆస్పత్రులు, పునరావాస పద్ధతులను వన్తారాలో సృష్టించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ దృష్టి సారించింది. ప్రఖ్యాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) వంటి సంస్థలతో అధునాతన పరిశోధన సహకారాన్ని ఏకీకృతం చేయడంపై దృష్టి పెట్టింది.