Ram Mandir Donations : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య రామచంద్రుడికి దేశ నలుమూలల నుంచి భక్తులు కానుకలు పంపిస్తున్నారు. చాలా మంది విరాళాల రూపంలో ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అయితే గుజరాత్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక రామమందిర నిర్మాణం కోసం ఏకంగా రూ.52 లక్షలు విరాళాలు సేకరించి ఇచ్చింది. ఇంత చిన్న వయసులో అంత నగదును సేకరించిన బాలికపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
సూరత్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక భవికా మహేశ్వరి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోందని, దాని కోసం ప్రజలు తమకు తోచినంతలో విరాళాలు అందిస్తున్నారని తెలుసుకుంది. తాను కూడా ఆలయానికి విరాళం అందించాలని అనుకుంది. రామాయణం మీద ఉన్న ఆసక్తితో బాలరాముడి కథలు చదివటం ప్రారంభించింది. ఆ కథలను కొవిడ్ సెంటర్స్, బహిరంగ సభల్లో గురించి ప్రజలకు చెప్పింది. 2021లో ఓ జైలులో ఉన్న ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రామమందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం ఇచ్చారు. అలా భవికా తాను 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి 50 వేల కిలోమీటర్లు ప్రయాణించి 300 పైగా ప్రదర్శనలు చేసింది. వాటి ద్వారా మొత్తంగా రూ.52 లక్షల వరకు సేకరించి, ఆ నగదును అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది.
"శ్రీరాముడికి సహాయం చేయడానికి ఉడత ముందుకు వచ్చినట్లే, నేను కూడా రామ మందిర నిర్మాణం కోసం నా వంతు సహాయం చేశాను. ఇలా చేయడానికి నేను నా తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందాను. చిన్నప్పటి నుంచి రామాయణం చదివేదాన్ని. ఎన్నో తరాల వారు రామ మందిరాన్ని చూడలేకపోయారు. కానీ భవ్య రామమందిరం మా తరంలో రూపుదిద్దుకోవడం మా అదృష్టం."
--భవికా మహేశ్వరి
అయితే కేవలం రాముడి గాథను ప్రదర్శించడమే కాకుండా, 108పైగా వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది భవికా. ఆ వీడియోలను దాదాపు లక్ష మంది వీక్షించారు. అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఒక పుస్తకాన్ని కూడా రాసింది.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ- ఆహ్వానం అందుకున్న దిగ్గజాలు వీరే
రామాలయ పునాదిలో కరీంనగర్, వరంగల్ గ్రానైట్- రాళ్ల ఎంపికలో కోలార్ శాస్త్రవేత్తల కీలక పాత్ర