Special Train For Mosquito Prevention : దోమల నివారణకు ప్రత్యేక రైలు ప్రారంభించింది దిల్లీ రైల్వే డివిజన్. మస్కిటో టెర్మినేటర్ ఆన్ వీల్స్ పేరుతో ప్రత్యేక రైలు ట్రాకుల వెంబడి పరుగులు పెట్టినట్లు శుక్రవారం వెల్లడించింది. అయితే ‘మున్సిపల్ కార్పొరేషన్ సమకూర్చిన ప్రత్యేక పరికరం డీబీకేఎంను ఓ వ్యాగన్‌పై అమర్చారు అధికారులు. ఆ పరికరం రైలు కదులుతున్న సమయంలో ట్రాక్‌లతోపాటు 50 నుంచి 60 మీటర్ల దూరం వరకు కూడా దోమల నివారణ మందును పిచికారీ చేస్తుంది.
రథ్‌ధానా నుంచి ఆదర్శనగర్ మీదుగా బాడ్లీ వరకు వెళ్లి మళ్లీ న్యూదిల్లీకి ఆ రైలు తిరిగి చేరుకుంటుంది. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలను వెల్లడించారు. దోమల నియంత్రణే లక్ష్యంగా సెప్టెంబర్ 21 వరకు ఆ ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని పరీవాహక ప్రాంతం (NCR)లో ఈ రైలు చక్కర్లు కొట్టనుందని తెలిపారు.
సాధారణంగా ఈ సీజన్‌లో దోమల లార్వాలు పెరుగుతాయి. దీంతో వాటిని నియంత్రించడమే లక్ష్యంగా మస్కిటీ టెర్మినేటర్ రైలు రెండు రౌండ్లు చుట్టేయనుంది. ఒక్క రౌండ్‌లో సుమారు 75 కిలోమీటర్లు మేర ట్రాక్‌ల వెంబడి ప్రయాణిస్తూ దోమల మందును పిచికారీ చేస్తుంది. రైల్వే ట్రాక్‌ల పక్కనే గుంతల్లో ఉన్న దోమల బెడదను నియంత్రించి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో నివసించే ప్రజలకు ఆరోగ్య భద్రతకు కల్పిస్తుంది. అదే సమయంలో రైల్వే కాలనీలు, పాడైన నీటి కాల్వలు, పరిశుభ్రంగా లేని రైల్వే భూములు అలా వివిధ చోట్ల రైల్వేకు సంబంధించిన పలు ప్రాంతాల్లో దోమల నియంత్రణ స్ప్రేను పిచికారీ చేయనున్నారు.