Rahul Gandhi on BJP : ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి కారకుడని రాహుల్ ఆరోపించారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కలిసి ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో రాహుల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ స్కీమ్
ఎన్నికల నిధుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రధాన మోదీ చెబుతున్నారని, అలా అయితే ఆ పథకాన్ని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసిందని రాహుల్ ప్రశ్నించారు. 'ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ స్కీమ్. ఇది భారత వ్యాపారులకు బాగా తెలుసు. ప్రధాని ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రధాని అవినీతికి కారకుడని దేశం మొత్తానికి తెలుసు.' అని రాహుల్ విమర్శించారు.
-
VIDEO | Lok Sabha elections 2024: “First of all, I would like to wish everyone on the occasion of Ram Navami. The upcoming election is an election of ideology. On one side is RSS and BJP who are trying to do away with the Constitution. While on the other hand, the Congress party… pic.twitter.com/jNtPK0UNSs
— Press Trust of India (@PTI_News) April 17, 2024
బడా వ్యాపారవేత్తలకే మేలు
కాంగ్రెస్ పేదరికాన్ని త్వరగా అంతం చేస్తుందని మోదీ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ స్పందించారు. పేదరికం ఒక్కసారిగా అంతం అవుతుందని ఎవరూ అనలేదని అన్నారు. అయితే పేదరికాన్ని తగ్గించడానికి బలమైన ప్రయత్నాలు చేస్తామన్నామని పేర్కొన్నారు. అమేఠీలో పోటీపై రాహుల్ ను విలేకర్లు ప్రశ్నించగా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చూసుకుంటుందని తెలిపారు.
"15-20 రోజుల క్రితం బీజేపీ 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు వారికి 150 సీట్లు వస్తాయని భావిస్తున్నాను. ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్ష కూటమి ఉంది. రాబోయే ఎన్నికలు భావజాలానికి సంబంధించినవి. ఒకవైపు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఈ ఎన్నికల్లో పెద్ద సమస్యలు. ప్రధాన సమస్యల నుంచి ప్రజలను మళ్లించేందుకు బీజేపీ, ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేయడం ద్వారా అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు మేలు చేశారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
యూపీలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి ఘాజీపుర్ వరకు ప్రభుత్వ మార్పు పవనాలు బలంగా వీస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఘనంగా వీడ్కోలు పలుకుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ హామీలన్ని బూటకమని తేలిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చీలిపోకుండా చూసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు.
త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. 63 స్థానాల్లో ఎస్పీ, కాంగ్రెస్ 17 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
నాగ్‌పుర్‌లో టఫ్ ఫైట్!- భారీ మెజారిటీతో గడ్కరీ హ్యాట్రిక్ కొడతారా? - Nitin Gadkari Nagpur
130 ఏళ్లనాటి రామాలయం- అయోధ్యతో లింక్- కుటుంబసమేతంగా రామయ్య! - Jaipur Ancient Ram Temple