Rahul Gandhi Nomination : లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కేరళలోని తన సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచి రెండో సారి బరిలో దిగిన ఆయన, తన నామినేషన్‌ను బుధవారం దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి అయిన వయనాడ్ జిల్లా కలెక్టర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళకు చెందిన ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు.
'ఎవరు ఎటువైపు ఉన్నారో మీకు తెలుసు'
నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. "2024 ఎన్నికలు ప్రజాస్వామ్యంతోపాటు భారత రాజ్యాంగం కోసం జరుగుతున్న యుద్ధం. ఒకవైపు మన దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు ఉన్నాయి. మరోవైపు రాజ్యాంగాన్ని పరిరక్షించే కాపాడే శక్తి ఉంది. ఎవరు ఎటువైపు ఉన్నారో మీ అందరికీ చాలా స్పష్టంగా తెలుసు" అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.
వయనాడ్‌లో భారీ రోడ్‌షో
అంతకుముందు వయనాడ్‌లో రాహుల్ గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. దిల్లీ నుంచి ముప్పాయనాడ్ గ్రామానికి హెలికాప్టర్‌లో చేరుకున్న రాహుల్, రోడ్డు మార్గం ద్వారా కాల్‌పెట్ట వరకు వెళ్లారు. అక్కడి నుంచి ప్రారంభమైన రాహుల్ రోడ్ షో వయనాడ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. రాహుల్ రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
గౌరవంగా భావిస్తున్నా: రాహుల్
ఈ సందర్భంగా రోడ్‌షోలో కూడా రాహుల్ మాట్లాడారు. "వయనాడ్‌లో ప్రతి వ్యక్తి నాకు ప్రేమ, అభిమానాన్ని అందించారు. సొంత వ్యక్తిలా చూసుకున్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని నేను ఓటర్లుగా భావించను. నా సోదరి ప్రియాంక గురించి ఎలా ఆలోచిస్తానో మీ గురించి అంతే. అందుకే వయనాడ్‌లో నాకు సోదరీమణులు, తల్లులు, సోదరులు ఉన్నారు" అని పేర్కొన్నారు. హస్తం పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాహుల్ ప్రసంగాన్ని అనువదించారు.
రాహుల్ X సురేంద్రన్
ఏప్రిల్ 26న మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్, సమీప అభ్యర్థి పీపీ సునీర్ (సీపీఐ)పై 4.31 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి సీపీఐ తరఫున అనీ రాజా ఇక్కడ పోటీ చేస్తున్నారు. విపక్ష 'ఇండియా' కూటమి పార్టీ అయిన సీపీఐ అక్కడ అభ్యర్థిని బరిలోకి దించడం చర్చనీయాశంమైంది. అనీ రాజా కూడా బుధవారమే నామినేషన్ వేశారు. మరోవైపు, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ పోటీలో దిగి రాహుల్‌కు గట్టి పోటీనిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్- ఆ ఐదుగురితో కలిసి!: రాహుల్
'EVM లేకుండా మోదీ గెలవలేరు- మేం ఓ శక్తితో పోరాడుతున్నాం'- ప్రధానిపై రాహుల్ ఫైర్