Rahul Gandhi JH Election Campaign : ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మోదీ సర్కార్ ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడీ, అదాయ పన్ను శాఖ, న్యాయశాఖ సహా, ప్రభుత్వ అధికారులను (బ్యూరోక్రసీ) నియంత్రిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని, దానిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాంచీలో జరిగిన 'సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్'లో పాల్గొన్న రాహుల్ గాంధీ - ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలపై ఘాటు విమర్శలు చేశారు.
"రాజ్యాంగంపై అన్ని వైపుల నుంచి నిరంతరం దాడి జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా ఈ దాడి చేసినవారిలో ఉన్నారు. వీరి నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది."
- రాహుల్ గాంధీ
ఆదివాసీలపై మోదీ సర్కార్ వివక్ష
మోదీ సర్కార్ ఆదివాసీలపై వివక్ష చూపిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 'అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన మోదీ సర్కార్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మాత్రం ఆహ్వానించలేదు. ఎందుకంటే ఆమె ఒక ఆదివాసి కావడమే' అని రాహుల్ గాంధీ అన్నారు.
VIDEO | " when bjp calls 'adivasi' 'vanvasi', what are they trying to do? they are trying to erase your history, philosophy, science, medical science and lifestyle. 'adivasi' means those who came first, whereas 'vanvasi' means those who live in forest," says congress mp rahul… pic.twitter.com/8XZ8Rzgw0a
— Press Trust of India (@PTI_News) October 19, 2024
"బీజేపీ 'ఆదివాసీ'లను కొత్తగా 'వనవాసీ'లు అంటోంది. ఆదివాసి అంటే మొదటి నుంచి ఉన్నవారు అని అర్థం. వనవాసి అంటే అటవీ ప్రాంతంలో జీవించేవారు అని అర్థం. ఈ విధంగా ఎంతో ఘనత కలిగిన ఆదివాసీల వారసత్వం, చరిత్ర, సంప్రదాయాలు, వైద్య విధానాలను ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది"
- రాహుల్ గాంధీ
కుల గణనను ఎవరూ ఆపలేరు!
కుల గణనను, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ గాంధీ అన్నారు.
"కుల గణన అనేది సామాజిక ఎక్స్-రే పొందేందుకు ఉపయోగపడే ఒక మాధ్యమం. కానీ దీనిని ప్రధాని మోదీ వ్యతిరేకిస్తున్నారు. అయితే మీడియా, న్యాయ వ్యవస్థ మద్దతు లేనప్పటికీ, దేశంలో కుల గణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించడాన్ని ఏ శక్తీ అపలేదు."
- రాహుల్ గాంధీ
ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం!
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత రాహుల్ గాంధీ ఝార్ఖండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఝార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇంతకు ముందు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ పోటీ చేస్తుందని తెలిపారు. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్, జేఎంఎంలు 70 స్థానాల్లో పోటీ చేస్తాయని పేర్కొన్నారు. మిగతా 11 స్థానాల్లో ఆర్‌జేడీ, లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తాయని ఆయన తెలిపారు.