Punjab Farmers Protest : కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత సహా డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు గురువారం రాత్రి సమావేశమయ్యారు. చండీగఢ్‌లో ఈ మేరకు మూడో విడత చర్చలు ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కేంద్ర ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం సమావేశానికి విచ్చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) నేత జగ్జీత్ సింగ్ ధల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పంధేర్ రైతుల తరఫున కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు.
Bharat Band News :
మరోవైపు, 'దిల్లీ చలో' ఆందోళన చేపట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. భారతీయ కిసాన్ పరిషత్ సైతం బంద్‌కు మద్దతు తెలిపింది. రైతు నాయకుడు గురునామ్ సింగ్ తమ తర్వాతి మూడు రోజుల కార్యాచరణను వెల్లడించారు. శుక్రవారం రోజు మూడు గంటల పాటు టోల్ ఫ్రీ కార్యక్రమం నిర్వహిచడం, శనివారం ట్రాక్టర్ల ర్యాలీ, 18 తేదీన రైతు, కార్మిక సంఘల సంయుక్త సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. బంద్‌కు పిలుపు నేపథ్యంలో నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ప్రజలు ఒకేచోట గుమిగూడవద్దని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోయిడాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీలైనంత వరకు ప్రజలు మెట్రో ఉపయోగించుకోవాలని సూచించారు.
రైతుల రైల్ రోకో
హరియాణలో రైతులుపై పోలీసు చర్యకు ఆగ్రహించిన రైతు సంఘాలు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో 4 గంటలపాటు రైల్ రోకో నిరసన చేపట్టాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జెండాలను చేతపట్టుకున్న రైతులు పట్టాలపై కూర్చోని నిరసన చేపట్టారు. ఈ కారణంగా దిల్లీ-అమృత్‌సర్ మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరోవైపు కేంద్రం పంజాబ్‌లోని పటియాల, సంగ్రూర్, ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 16 తేదీ వరకూ ఇంటర్‌నెట్‌ను నిలిపివేయాలని ఆదేశాలను జారీచేసింది. అటు, హరియాణాలోని బీజేపీ సర్కారు ఇంటర్నెట్ బ్యాన్‌ను ఫిబ్రవరి 17 వరకు పొడగించింది. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసులపైనా ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ఏడు జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలవుతున్నాయి.
రైతులపై సీఎం ఫైర్!
నిరసన కార్యక్రమం కోసం రైతులు అనుసరిస్తున్న విధానంపై హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సైన్యం తరహాలో దేశ రాజధానిలోకి వెళ్లాలని భావించడం సరైన చర్య కాదని హితవు పలికారు. రైతులు దిల్లీ వెళ్లడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజలు దేశ రాజధానికి వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. అందుకు రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణించవచ్చన్నారు. ట్రాక్టర్లు, ట్రాలీల్లో ఏడాదికి సరిపడా ఆహార పదార్థాలతో రావడం వెనక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. ట్రాక్టర్ రవాణా పరికరం కాదని, అది కేవలం వ్యవసాయ పరికరమేనని వెల్లడించారు. వారి కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏ లక్ష్యంతో చేస్తున్నామనే విషయాన్ని రైతులు ఆలోచించాలని ఖట్టర్ వ్యాఖ్యానించారు.
రైలు రోకోకు రైతులు పిలుపు- 4 గంటలపాటు ట్రైన్లు బంద్, చర్చలు ఫలించేనా?
'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం