Pune Rash Driving Case : పుణెలో రాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన బాలుడు మద్యం సేవించినట్లు జువైనల్ కోర్టు నిర్ధరించింది. మోటారు వాహనాల చట్టంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడిపే నేరాలకు సంబంధించిన సెక్షన్ల ఆధారంగా శిక్ష విధించనున్నట్లు పేర్కొంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం తొలిసారి మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లేదా ఆరేళ్ల జైలుశిక్ష, అదేతప్పు రెండోసారి చేస్తే రెండేళ్ల జైలు, రూ.15 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
గంటన్నరలోనే రూ.48వేలు ఖర్చు
పుణె రాష్ డ్రైవింగ్ కేసులో బాల నేరస్థుడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి కొంతసేపటి ముందు మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. 12వ తరగతి పరీక్షల్లో పాసైనందుకు సెలబ్రేట్ చేసుకోవాలని బార్‌కు వెళ్లినట్లు చెప్పారు. కేవలం గంటన్నరలోనే రూ.48 వేలు ఖర్చు చేశాడు. ఆ తర్వాత మరో బార్‌కు వెళ్లి మైనర్, అతడి స్నేహితులు అక్కడకూడా ఫూటుగా మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే లగ్జరీ కారులో ఇంటికి బయలుదేరాడు.
200కిలోమీటర్ల వేగంతో కారు నడిపి!
ఈ క్రమంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అనిష్ అవదియా, అశ్విని కోస్టా అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అశ్విని 20అడుగుల ఎత్తుకు ఎగిరిపడినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలుడిని స్థానికులు చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలుడికి కేవలం 15 గంటల వ్యవధిలోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం, రోడ్డు ప్రమాదాలపై 300 వాక్యాలతో వ్యాసం రాయాలని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
25 ఏళ్లు వచ్చేంత వరకు కూడా!
నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరి మృతి కారణమైన బాలుడికి డ్రైవింగ్ లైసెన్సు జారీపై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తెలిపారు. అతడికి 25 ఏళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వబోమన్నారు. ఈ కేసులో నిందితుడి తండ్రి వికాస్ అగర్వాల్ పుణెలో పేరున్న ఓ రియల్టర్ అని గుర్తించారు. కుమారుడు చేసిన ఘనకార్యం వల్ల అరెస్ట్ తప్పదని భావించిన బాలుడి తండ్రి, తప్పించుకునేందుకు సినీఫక్కీలో నానా తంటాలు పడినట్లు తెలుస్తోంది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక కారులో ముంబయి బయల్దేరి మరో కారును డ్రైవర్‌తో గోవాకు పంపించాడు. మార్గమధ్యంలో స్నేహితుల ద్వారా కార్లు మారాడు. ఫోన్ నంబరు ట్రాక్ చేస్తారని భావించి కొత్త సిమ్ ఉపయోగించాడు.
నంబర్ ప్లేట్ లేకుండా కొన్ని నెలల పాటు!
వంకరబుద్ధితో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్‌తో పోలీసులకు దొరికిపోయాడు. వికాస్ అగర్వాల్‌తోపాటు బార్ల యజమానులను అరెస్టు చేసిన పోలీసులు, ఓ బార్‌ను సీజ్ చేశారు. ప్రమాదానికి కారణమైన పోర్షే కారు కొన్నినెలలపాటు నంబర్ ప్లేట్ లేకుండా పుణె రోడ్లపై తిరిగినట్లు తెలిసింది. 2కోట్ల 50 లక్షల విలువైన ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారుకు 1758 రూపాయలు ఖర్చుచేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడినట్లు తెలుస్తోంది. మార్చిలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కారును తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో బెంగళూరు నుంచి మహారాష్ట్రకు తరలించినట్లు తెలిసింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వాహనాన్ని RTOకు తీసుకెళ్లలేదని సమాచారం.