Public Examinations Bill 2024 : ఉద్యోగం సాధించాలని ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు ఆశావహులు. తీరా ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అయిందని పరీక్షను రద్దు చేస్తారు. దీంతో ఏళ్ల పాటు పడిన శ్రమ వృథా అవుతుంది. కొన్న సందర్భాల్లో పోటీ పరీక్షల్లో కాపీ కొట్టి, అర్హత లేని వారు ఉద్యోగాలు సాధిస్తారు. పోటీపరీక్షల్లో ఇలా చాలా రకాలుగా అవకతవకలు జరుగుతుండడం వల్ల, కష్టపడి చదివిన వారికి నిరాశ ఎదురవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఇకపై పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రవెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు, 2024'ను సోమవారం లోక్‌సభ ఆమోదించింది. అయితే ఈ బిల్లు అమలైతే పోటీపరీక్షల్లో అవకతవకలు ఎలా తగ్గుతాయి? అక్రమాలకు పాల్పడిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? ఏ పరీక్షలు ఈ చట్టం కిందికి వస్తాయి? అనే విషయాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చట్టం అమలైతే ఏం జరుగుతుంది?
ఈ చట్టం అమల్లోకి వస్తే పోటీ పరీక్షల్లో పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా కనిష్ఠంగా మూడేళ్ల నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాకుండా రూ.కోటి వరకు జరిమానా కూడా పడుతుంది. ఈ చట్టం వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఎందుకీ చట్టం తెచ్చారు?
గతంలో రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగాయి. దీని కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో అనేక మంది ఉద్యోగ ఆశావహులు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వారికి చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. అయితే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు లేదా అభ్యర్థులు ఈ చట్టం పరిధిలోకి రారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. గ్రూపులు, ముఠాలు, వ్యవస్థీకృత మాఫియాగా ఏర్పడి పేపల్ లీకేజీ వంటి అక్రమాల్లో పాల్పడే వారికే ఈ చట్టంలోని శిక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)- యూపీఎస్సీలో సివిల్ సర్వీస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, కంబైన్డ్ మెడికల్ సర్వీస్, ఇంజినీరింగ్ సర్వీస్ వంటి తదితర పరీక్షలకు వర్తిస్తుంది.
- స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)- ఎస్ఎస్సీలోని గ్రూప్-సీ (నాన్ టెక్నికల్), గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్) వంటి పోటీ పరీక్షలు ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి.
- రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)- ఆర్ఆర్బీ నిర్వహించే గ్రూప్-సీ స్టాఫ్, గ్రూప్-డీ స్టాఫ్ వంటి తదితర పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది.
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) - వివిధ జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో అన్ని స్థాయిల ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు కొత్త చట్టం వర్తిస్తుంది.
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) - ఎన్టీఏ నిర్వహించే JEE (మెయిన్), NEET-UG, UGC-NET, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- CUET మొదలైన పరీక్షలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
ఈ నేరాలకు పాల్పడితే, శిక్షలు తప్పవు!
- ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాల లీకేజీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోవడం
- అభ్యర్థులకు నేరుగా గానీ, ఇతర మార్గాల ద్వారా గానీ సహకరించడం
- కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేయడం
- నియామక సంస్థల పేరుతో నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడం
- నకిలీ పరీక్షలను నిర్వహించడం
- నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేయడం
- నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం శిక్షార్హం.
- పరీక్షల సమయంలో అనుకూలురకు సీట్లను మార్చడం పరీక్ష తేదీలను, షిఫ్టులను అనుకూలంగా మార్చడం సైతం శిక్షార్హమే.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రకారం పరీక్షలను నిర్వహించే సంస్థే, అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలకు రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. అలాంటి సంస్థలను భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల నుంచి నాలుగేళ్లపాటు నిషేధిస్తారు.
ఆశావహుల రియాక్షన్
కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉద్యోగ ఆశావహులు స్వాగతించారు. పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకోవడం కోసం కేంద్రం తీసుకున్న చర్యపై హర్షం వ్యక్తం చేశారు. 'ఈ బిల్లు ఒక చట్టంగా మారిన తర్వాత, ప్రవేశ పరీక్షలలో మోసాలను నియంత్రించడానికి వీలు కలుగుతుంది. కాబట్టి నాలాంటి ఉద్యోగార్థులు సంతోషంగా ఉంటారు. పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల, నిజాయితీ గల ఆశావహులకు ఎంపిక ప్రక్రియలో సరైన అవకాశం లభించడం లేదు' అని దిల్లీలో మెడికల్ పరీక్షకు సిద్ధమవుతున్న మేఘా శర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
"లక్షల మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు హాజరవుతారు. ఇందులో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు ఉంటారు. వారు కోచింగ్ ఫీజు, పుస్తకాలు, వసతి కోసం ప్రిపరేషన్ సమయంలో అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆ పరిస్థితిలో అక్రమాలు జరగడం వల్ల పరీక్ష రద్దు అయిందనే విషయం గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధను అనుభవిస్తారు. అయితే ఈ కొత్త బిల్లు వారికి ఒక ఆశాకిరణం."
--ఉజ్వల్ కశ్యప్, పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న ఆశావహుడు
"పరీక్షలను క్లియర్ చేయడానికి అక్రమ మార్గాలు ఎంచుకున్న వారిని నిరోధించడానికి ఈ చట్టం సహాయపడుతుంది. పేపర్ లీక్, మోసం, గాడ్జెట్‌లను ఉపయోగించడం వల్ల పరీక్షలు రద్దు కావడం మనం గతంలో చాలాసార్లు చూశాము. పరీక్షలు రద్దు అయినప్పుడల్లా మేము బాధపడతాం. అలా జరిగినప్పుడు మేము నిజాయితీగా చేసిన ప్రయత్నాలు, మా విలువైన సమయం వృథా అయినట్లే."
--వంశ్ కుమార్ సింగ్, పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న ఆశావహుడు
ఈడీ అధికారుల్లా నటించారు- రూ.1.69 కోట్లు కాజేశారు- చివరకు ఏమైందంటే?
'సహ జీవనాన్ని దాస్తే ఆరు నెలల జైలు'- ఉత్తరాఖండ్ అసెంబ్లీలో UCC బిల్లు