Project Cheetah Web Series : ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు తీసుకువచ్చిన చీతాలు ఇక్కడ మనుగడ సాగించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలిపే ఈ ప్రాజెక్టుపై వెబ్‌సిరీస్ చిత్రీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 'షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు ది వరల్డ్' పేరిట ఈ వెబ్‌సిరీస్ నాలుగు భాగాలుగా చిత్రీకరించనుంది. సెప్టెంబరు 17 నాటికి చీతాలను భారత్‌కు తీసుకువచ్చి ఏడాది అవుతుంది.
ఆ సందర్భంగా సెప్టెంబర్ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టీసీఏ) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ వైభవ్‌చంద్ర మాథుర్ ఓ లేఖ రాశారు. ప్రపంచ తొలి ఖండాతర బదిలీ చీతా ప్రాజెక్టుపై వెబ్‌సిరీస్ ప్రతిపాదనకు అథారిటీకి చెందిన 8వ సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపినట్లు లేఖలో పేర్కొన్నారు. కునో నేషనల్ పార్కుతోపాటు గాంధీసాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణకు నిబంధనల పరిధిలో నిర్మాణసంస్థకు సహకరించవలసిందిగా కోరారు.
170 దేశాల్లో ప్రసారం
వివిధ భాషల్లో 170 దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్ ద్వారా ఈ వెబ్‌సిరీస్ ప్రసారం కానుంది. భారత్‌లో కనుమరుగైన చీతాలను మళ్లీ ఇక్కడకు తీసుకురావడంలో ఈ ప్రాజెక్టు ఎదుర్కొన్న కష్టనష్టాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ సిరీస్ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. భారత్‌కు నమీబియా నుంచి 8, దక్షిణాఫ్రికా నుంచి 12 మొత్తం 20 చీతాలను ఇప్పటిదాకా తీసుకువచ్చారు. ఇందులో 8 మృతిచెందగా, చీతాలకు పుట్టిన 17 కూనల్లో 12 సజీవంగా ఉన్నాయి.
కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి- ఒకే నెలలో రెండు!
ఇటీవలె మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో నమీబియా చిరుత మృతి చెందింది. ఆగస్టు 5వ తేదీన ఆఫ్రికాకు చెందిన ఐదు నెలల గామిని అనే చిరుత మృతి చెందగా, ఇప్పుడు పవన్ అనే మరో చిరుత మరణించింది. నీటిలో మునిగి చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు.