Precautions To Keep Pets Healthy : ఇటీవల కాలంలో చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని ఇంట్లోని కుటుంబ సభ్యులలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సాధారణంగా ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువులలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఉంటాయి. నిజానికి వీటిని పెంచుకోవడం వల్ల మనకు ఎప్పుడైనా మనసు బాగాలోకపోయినా, బోర్ కొట్టినా, వాటితో కాసేపు ఆడితే మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులంటున్నారు. అయితే, కొంత మంది తమ బిజీ లైఫ్ షెడ్యూల్ల వల్ల వాటి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ చూపించరు. దీనివల్ల అవి అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి, పెట్స్ ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉండటానికి ఇలా చేయండి :
అనారోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించండి : పెంపుడు జంతువులకు కూడా మనుషుల్లానే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, వాటిని వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స అందించడం వల్ల అవి ఎక్కువ రోజులు జీవించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెట్స్ రెండు మూడు రోజుల నుంచి నీరసంగా ఉంటూ, ఎటువంటి ఆహారం తినకుండా ఉంటే వాటిని ఒకసారి స్థానిక పశు వైద్యుడికి చూపించి టెస్ట్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
టీకాలు వేయించండి : పెంపుడు జంతువులు పెరిగే కొద్ది వాటికి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందులో కొన్ని ప్రాణాంతకమైనవి కూడా ఉండవచ్చు. అందుకే, ముందు జాగ్రత్తగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నారు.
పోషకాహారాన్ని అందించండి : వివిధ కారణాల వల్ల పెంపుడు జంతువులలో కూడా ఊబకాయం సమస్య కనిపిస్తోంది. దీనివల్ల వాటిలో మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటి ఆరోగ్యకరమైన బరువు కోసం రోజూ పోషకాహారం అందించాలని సూచిస్తున్నారు.
బిహేవియర్ గమనించండి : పెంపుడు జంతువుల ప్రవర్తనలో తేడాలు ఉంటే వాటిని వెంటనే పశు వైద్యుడికి చూపించాలని అంటున్నారు. ప్రవర్తనలో మార్పులు.. తరచుగా పెంపుడు జంతువులలో అంతర్లీన ఆరోగ్య సమస్యలు లేదా ఒత్తిడిని సూచిస్తాయి. అవి ఎంటంటే ఎక్కువగా అరవడం, బద్ధకంగా ఉండటం, కోపంగా ప్రవర్తిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అంటున్నారు. ఈ లక్షణాలు అన్నీ అవి ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాయని తెలియజేస్తాయని నిపుణులంటున్నారు. ఈ మార్పులను వెంటనే పరిష్కరించడం ద్వారా మీ పెంపుడు జంతువు లైఫ్ టైమ్‌ను పెంచవచ్చు.
చివరిగా : పెంపుడు జంతువులు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే వాటికి రెగ్యులర్‌గా హెల్త్ చెకప్‌లు చేయించాలి. పోషకాహారం అందించాలి. అలాగే వాటిని ఇంట్లోనే ఒకచోట ఎక్కువ సేపు కూర్చుని ఉంచకుండా అలా ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. అప్పుడే అవి మానసికంగా, శారీరకంగా హెల్దీగా ఉంటాయని అంటున్నారు.
మీకు పెంపుడు జంతువులంటే ప్రాణమా? అయితే 'పెట్ ఇన్సూరెన్స్' మస్ట్! బెనిఫిట్స్ ఏమిటంటే?
మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!