Polling Team First Time Entry In Manatu Chak Road : ఝార్ఖండ్‌లోని పలాము జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఎన్నికలు వచ్చాయంటే అధికారులు అక్కడికి వెళ్లాలంటే భయంతో వణికిపోయేవారు. ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలను కలిపే 14 కిలోమీటర్ల రహదారిపై 30 సార్లుకుపైగా నక్సల్స్ దాడులు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 2004 ఎన్నికలకు 2024 ఎన్నికల మధ్య కాలంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి.
2004 ఎన్నికల తర్వాత ఏ పోలింగ్ సిబ్బంది కూడా ఈ రోడ్డు మార్గాన వెళ్లేందుకు సాహసించలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓ పోలింగ్ సిబ్బంది ఈ రహదారి గుండా వెళ్లబోతోంది. ఇప్పటివరకు ఈ రోడ్డు మార్గాన్ని చాలా సున్నితమైనదిగా పరిగణించారు. 2004 నుంచి ఇప్పటివరకు ఈ రోడ్డుపై 30 సార్లుకుపైగా నక్సల్స్ దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 8మంది సైనికులు వీరమరణం పొందారు. 2011లో జరిగిన నక్సల్స్ దాడిలో అప్పటి పాలము ఎస్పీ అనూప్ టి మాథ్యూ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 2009-10లో ల్యాండ్ మైన్స్ పేలుడులో నలుగురు సైనికులు వీరమరణం పొందారు.
2004-2019 వరకు హెలికాప్టర్‌లోనే
చత్రా లోక్‌సభ నియోజకవర్గంలోని చక్, మన్సూరియా పంచాయతీలో ఓటు వేయడానికి పోలింగ్ సిబ్బంది మనాతు చక్ రోడ్డు నుంచే వెళ్లాలి. కానీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడం వల్ల 2004 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా ఈ రెండు ప్రాంతాలకు తరలించారు. కానీ ఇప్పుడు తొలిసారిగా పోలింగ్ సిబ్బంది రోడ్డు మార్గంలో ఆ ప్రాంతానికి వెళ్లనున్నారు. 2019 నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితి మారిందని పాలము ఎస్పీ రీష్మా రమేశన్ తెలిపారు. భద్రతా బలగాలు ఉండటం వల్ల ప్రజలకు సురక్షితమైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. చక్, మసూరియా ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని, ఈ పికెట్ల ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ మనాతు రోడ్డుపై భద్రతా బలగాలు నిరంతరం ఓ కన్నేసి ఉంచుతాయని వెల్లడించారు.
సీఆర్‌పీఎఫ్ గస్తీతో రోడ్డు నిర్మాణం పూర్తి!
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మనాతు చక్ రోడ్డు మరమ్మత్తుల పనుల కోసం ఎనిమిది సార్లు టెండర్లు వేశారు. మావోయిస్టుల భయంతో ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈ రహదారి పనులు జరగలేదు. 2017-18లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం కోసం సీఆర్పీఎఫ్ను రంగంలోకి దింపింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన రెండు కంపెనీల సమక్షంలో మనాతు చక్ రోడ్డును వేశారు. రోడ్డు మరమ్మతుల సమయంలో కూడా నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు. కానీ గతంలో ఉన్న వాతవావరణం ఇప్పుడు అక్కడ లేదు. పూర్తిగా మారిపోయింది. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎలాంటి భయం లేకుండా రాకపోకలు సాగిస్తున్నామని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.
తుపాను బీభత్సానికి ఐదుగురు బలి- 100మందికి గాయాలు- మోదీ సంతాపం - Bengal Storm Update
ప్రపంచంలోనే అతి చిన్న ఆవు- 'బంగారు' పాలను ఇస్తుందట! చూసేందుకు ప్రజలు క్యూ - WORLD SMALLEST COW