PM Narendra Modi on Congress : కమీషన్ల ఆర్జనే లక్ష్యంగా ఇండి కూటమి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మాత్రం భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మిషన్ కోసం పనిచేస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పుర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో గెలవకుండా ఆపడానికి మాత్రమే విపక్షాలు పోరాటం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. అందుకోసం సమాజ్‌వాదీ పార్టీ గంటకో అభ్యర్థిని మారుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నచోట ప్రధాన ప్రతిపక్షం కనీసం అభ్యర్థులను బరిలో దించలేకపోతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపైనా విమర్శలు గుప్పించారు. అందులో ముస్లింలీగ్, వామపక్షాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ విమర్శలు చేశారు.
"ఇండియా కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారింది. అందువల్ల వారి ఒక్క మాటను దేశప్రజలను సీరియస్‌గా తీసుకోవటం లేదు. కానీ దేశమంతా ఏకసర్వంతో చెబుతోంది. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ దశాబ్దాలక్రితమే అంతమైందని, ఇప్పుడున్న కాంగ్రెస్ వద్ద దేశానికి మేలుచేసే విధానాలు కానీ దేశ నిర్మాణానికి కావాల్సిన దార్శనికత కానీ లేదు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను మీరంతా చూశారు. నేటి కాంగ్రెస్ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో సంబంధం కోల్పోయింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అదే ఆలోచన కనిపిస్తోంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో ముస్లింలీగ్‌లో ఉన్న ఆలోచన"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'కాంగ్రెస్‌కు వారసత్వంగా వచ్చిన హక్కు'
ఆ తర్వాత రాజస్థాన్‌లోని అజ్‌మేర్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఎదురుదాడి మరింత పెంచారు. ప్రజలను దోచుకోవటం వారసత్వంగా వచ్చిన హక్కు హస్తం నేతలు భావిస్తున్నారని ఆరోపిచారు. వారి దోపిడి దుకాణాన్ని మూసేయించటం వల్ల కలత చెందుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.'దేశంలో పెద్దపెద్ద పేర్లు ఉన్నవారు. పనిచేసే నన్ను దూషిస్తున్నారు. పేరున్న వారు దూషించటం తమ అధికారం అనుకోవచ్చు. పనిచేసే నేను ఆ దూషణలను జీర్ణించుకుంటున్నా. నాపై వారు ఎందుకు నిరాశతో ఉన్నారంటే దేశంలోని గ్రామాలు, పేదలకు అండగా నిలబడ్డాను. ప్రజాధనం దోచుకోవటాన్ని వారు వారసత్వ హక్కుగా భావిస్తారు. మోదీ పదేళ్లలో దోపిడీ రోగానికి శాశ్వత చికిత్స చేశాడు. మోదీ వారి దోపిడీ దుకాణం షట్టర్‌ను దించేశాడు. అందువల్లే వారు నిరాశతో ఉన్నారు' అని ప్రధాని అన్నారు.
వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పుర్, రాజస్థాన్‌లోని అజ్‌మేర్ సభల తర్వాత ప్రధాని మోదీ దిల్లీ శివారులోని గాజియాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎంపీ వీకే సింగ్, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి అతుర్ గార్గ్ కూడా పాల్గొన్నారు. అనంతరం సహరన్‌పుర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 'ప్రభుత్వ పథకాలు వందశాతం అర్హులందరికీ అందాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పదేళ్ల నుంచి పనిచేస్తోంది. అదే నిజమైన సెక్యూలరిజం, సామాజిక న్యాయం. ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపకుండా ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం' అని నరేంద్ర మోదీ అన్నారు.
బంగాల్లో కలకలం- NIA అధికారుల కారుపై రాళ్ల దాడి- వాహనం ధ్వంసం - NIA Team Attacked in West Bengal