PM Modi Seech In Parliament : లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరసగా మూడోసారి తాము అధికారంలోకి రావడం వల్ల కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల తమ అభివృద్ధిని చూసే మరోసారి అధికారం ఇచ్చారని చెప్పారు. సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారన్న మోదీ ఆయనతో ఏమీ కాదని దేశానికి తెలుసని దుయ్యబట్టారు.
#WATCH | Prime Minister Narendra Modi says, " i pray to god to give them wisdom. i also hope that the 'baalak buddhi' also gets wisdom. i express my heartfelt gratitude to the president's address and to you for giving me time to explain in detail and nobody can suppress the voice… pic.twitter.com/oweSASBxx1
— ANI (@ANI) July 2, 2024
"సానుభూతి పొందేందుకు రాహుల్ గాంధీ కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ వేల కోట్ల రూపాయల అవినీతి కేసులో ఆయన బెయిల్‌పై బయట ఉన్నారనే నిజం దేశానికి తెలుసు. ఓబీసీ ప్రజలను దొంగలుగా అభివర్ణించిన కేసులో రాహుల్‌కు శిక్ష పడింది. సుప్రీంకోర్టులో బాధ్యతారాహిత్య ప్రకటన చేయడం వల్ల క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ లాంటి వ్యక్తిని అవమానించినందుకు ఆయనపై కేసు ఉంది. నేడు దేశానికి తెలుసు ఆయన (రాహుల్)తో ఏమీ కాదని."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
దేశ అభివృద్ధితోనే భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగమని మోదీ చెప్పారు. ఆయన ప్రసంగం మొదలు పెట్టగానే మణిపుర్, నీట్ అంశాలపై ప్రధాని మాట్లాడాలని విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఎంపీలను ఆందోళన చేయమనడం సరికాదంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి, సభాపతి ఓం బిర్లా అన్నారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు తగ్గలేదు. విపక్ష ఎంపీల ఆందోళనలు మధ్యే, సమాధానం కొనసాగించిన ప్రధాని మోదీ తమ పదేళ్ల పాలన బాగుంది కాబట్టే ప్రజలు మూడోసారి అవకాశం ఇచ్చారని తెలిపారు.
"పదేళ్ల పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. స్వతంత్ర భారత దేశంలో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడేసిన సఫల ప్రయత్నమే ఈ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి కారణం. 2014లో మేము తొలిసారి విజయం సాధించి వచ్చినప్పుడు, ఎన్నికల సమయంలోనూ అవినీతిని సున్నా శాతానికి తీసుకెళతామని చెప్పాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారత సామర్థ్యం పెరిగింది. ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగింది. మా ప్రతి విధానం, మా ప్రతి నిర్ణయం, మా ప్రతి చర్య ఏకైక లక్ష్యం భారత్ ప్రథమం."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఎన్డీఏ బుజ్జగింపు రాజకీయాలు చేయదన్న ప్రధాని ప్రజలు అందరినీ సంతృప్తి పరిచేలా ప్రభుత్వ పాలన ఉంటుందని వెల్లడించారు.
"ఈ దేశం చాలాకాలం పాటు బుజ్జగింపు రాజకీయాలను చూసింది. ఈ దేశం చాలాకాలం బుజ్జగింపు పరిపాలనా విధానాలను చూసింది. మేము తుష్ఠికరణ్ కాకుండా సంతుష్ఠికరణ్ విధానాలతో పాలన సాగిస్తున్నాం. సంతుష్ఠికరణ్ అంటే అన్ని పథకాలు అందరికీ చేరడమే. ప్రభుత్వ పాలనను ఆఖరి వ్యక్తి వరకు చేరాలనే మా సంకల్పం ఏదైతో ఉందో దాన్ని పరిపూర్ణం చేయడమే."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
2014కు ముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉండేవారన్న మోదీ తమ ప్రభుత్వం రావడం వల్లనే ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండేదని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ మోదీ విమర్శలు గుప్పించారు.
#WATCH | Prime Minister Narendra Modi says, " there was a time before 2014 when those 7 words (iss desh ka kuch nahi ho sakta) had settled in the minds of the people of india, the society was drowned in the depths of despair, then the people of the country chose us to serve them… pic.twitter.com/P67yH7uBcL
— ANI (@ANI) July 2, 2024
"2014 కంటే ముందు ఓ సమయం ఉండేది. ఉగ్రవాదులు వచ్చి ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేసేవారు. 2014 కంటే ముందు అమాయక ప్రజలు ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయేవారు. ఉగ్రవాదులు దేశంలోని ప్రతి మూలను లక్ష్యంగా చేసుకునేవారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా నోరు మెదపకుండా కూర్చునేది. 2014 తర్వాత హిందుస్థాన్.. ఉగ్రవాదుల ఇళ్లలోకి వెళ్లి మరీ వారిని మట్టుబెడుతుంది."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ప్రధాని మాట్లాడుతున్నంతసేపూ లోక్‌సభలో విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రధాని ప్రసంగానికి విపక్షాలు అంతరాయం కలిగించడానికి వ్యతిరేకంగా లోక్‌సభ ఓ తీర్మానం ఆమోదించింది. అనంతరం నిరవధికంగా వాయిదా పడింది.
'దేశ సేవే తొలి బాధ్యత- పార్లమెంట్ నియమాలు పాటించాలి'- NDA ఎంపీలకు మోదీ సూచనలు - NDA Meeting 2024