PM Modi Jamaica Visit : కరీబియన్ దేశం జమైకా అభివృద్ధి పయనంలో భారతదేశం విశ్వసనీయ భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీవ ఇంధనం, కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి పలు రంగాల్లో జమైకాతో నైపుణ్యాన్ని పంచుకోడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. ఇండియాకు వచ్చిన జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్‌తో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. అనంతరం పీఎంవో ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు దేశాధినేతల మధ్య పలు ప్రాంతీయ, భౌగోళిక అంశాలు చర్చకు వచ్చాయని, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకొని, ప్రపంచ శాంతి భద్రతల కోసం ఇరుపక్షాలు కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి సహా పలు ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలు అవసరమనే విషయంలో రెండు దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో జమైకా సాయుధ దళాలకు శిక్షణ ఇవ్వడానికి, వారి సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
సవాళ్లు ఉన్నాయ్!
వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం లాంటివి భారత్, జమైకాలు ఎదుర్కొంటున్న సాధారణ సవాళ్లని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లతోనూ జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్‌నెస్ సమావేశమై చర్చలు జరిపారు. జమైకా ప్రతినిధి బృందం గౌరవార్థం ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు జమైకన్ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా హాజరు అయ్యారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రారంభించిన ‘భాజపా గురించి తెలుసుకోండి’ కార్యక్రమంలో భాగంగా నడ్డాతోనూ ఆండ్రూ భేటీ అయ్యారు.
నెతన్యాహుకు మోదీ ఫోన్!
పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలపై చర్చించారు. 'పశ్చిమాసియాలో ఇటీవల కాలంగా జరిగిన పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుని బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉంది' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.