PM Modi New Scheme : దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల పక్కన ట్యాక్సీ, ట్రక్కు డ్రైవర్ల కోసం ఆధునిక వసతి గృహాల అభివృద్ధికి ఓ కొత్త పథకం రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందులో భాగంగా తొలి విడతలో 1000 భవనాలను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ భవనాల్లో డ్రైవర్ల కోసం మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, తాగునీటి వసతులు ఉంటాయని తెలిపారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024 సమావేశంలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించారు.
"వాహన రంగంలో డ్రైవర్లది చాలా కీలకమైన పాత్ర. చాలా గంటల పాటు వాళ్లు వాహనాన్ని నడుపుతుంటారు. కానీ వాళ్లకు సరైన విశ్రాంతి ప్రాంతం లభించడం లేదు. అవసరమైనంత విశ్రాంతి వాళ్లు తీసుకోకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారి తీస్తోంది. వీటి వల్ల ప్రయాణాలు సులభతరం అవుతాయి. ఫలితంగా వారి ఆరోగ్యం మెరుగుపడి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. దేశంలో 2014కు ముందు పదేళ్లలో 12 కోట్ల వాహనాలు అమ్ముడైతే, 2014 తర్వాత పదేళ్ల కాలంలో 21 కోట్ల వాహన కొనుగోళ్లు జరిగాయి. పదేళ్ల క్రితం దేశంలో 2వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే, ప్రస్తుతం 12లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేశారు."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'మూడోసారి ప్రభుత్వంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్'
NDA మూడో విడత ప్రభుత్వంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడో సారి తాము అధికారం చేపట్టడం ఖాయమని పేర్కొన్నారు. దేశ మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందడం సహా రికార్డులు సృష్టిస్తోందని, ఇందుకు అటల్ టన్నెల్, అటల్ సేతును ఉదాహరణగా చెప్పారు. గత పదేళ్లలో 75 విమానాశ్రయాలు నిర్మించినట్లు ప్రధాని గుర్తుచేశారు.
-
The mobility sector will play a key role in realising our dream of a Viksit Bharat. pic.twitter.com/RvZ3cas715
— Narendra Modi (@narendramodi) February 2, 2024
" సముద్రాలు, పర్వతాలపై కూడా తక్కువ సమయంలో అద్భుత ఇంజినీరింగ్ కట్టడాలు నిర్మిస్తున్నాం. అటల్ టనెల్ నుంచి అటల్ సేతు వరకు భారత మౌలిక వసతుల అభివృద్ధి రంగం కొత్త రికార్డులు సృష్టించింది. గత పదేళ్లలో 75 కొత్త విమానాశ్రయాలు నిర్మితమయ్యాయి. 4 లక్షల గ్రామీణ రహదార్లను వేశాం"అని ప్రధాని మోదీ తెలిపారు. స్థానికంగా లభ్యమవుతున్న ముడి సరకులను ఉపయోగించి బ్యాటరీలు తయారు చేసేలా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)పై దృష్టి పెట్టాలని పరిశ్రమకు ఆయన సూచించారు.
'ఇది భారత్ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్- యువతకు లెక్కలేనన్ని అవకాశాలు'
'వికసిత్ భారత్‌లో సాధికార న్యాయవ్యవస్థ భాగమే- కొత్త యుగంలోకి పోలీస్, దర్యాప్తు వ్యవస్థలు'