PM Modi Meeting On Heat Wave : వేసవి నెలల్లో విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయన్న సూచనల నేపథ్యంలో సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా స్థాయి యంత్రాంగాలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాని ఆదేశించారు. కేంద్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, భారత వాతావరణ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) అధికారులు గురువారం దిల్లీలో జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు.
Modi Review On Heat Wave Conditions : ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు ప్రధానికి వివరించారు. మధ్య పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతంలో ఎండ తీవ్రత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్, తాగునీరు లభ్యత, ఆరోగ్య రంగానికి సంబంధించి ఆసుపత్రుల సన్నద్ధతపై సమీక్షించినట్లు కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.
టీవీలు, రేడియోలు సహా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అవసరమైన సమాచారం అందించి ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎన్‌డీఎంఏలు జారీ చేసిన సలహాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు అధికారులు చెప్పారు. అలాగే కార్చిచ్చు వంటి విపత్తుల నిర్వహణపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
ఔట్ డోర్ వర్కర్లపై అధిక ప్రభావం!
Sun Heat Effects On Outdoor Workers : ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికంగానే ఉంది. అయితే భానుడి భగభగల ప్రభావం ప్రధానంగా ఔట్ డోర్ వర్కర్లపైనే ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు, రోడ్లపై చిరువ్యాపారాలు చేసుకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు సహా నేరుగా ఆ సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యేవారు ఈ జాబితాలోకి వస్తారు. అయితే ఇన్డోర్ వర్కర్లు అంటే కార్యాలయాలు, ఎండ వేడి ఎక్కువగా తాకకుండా పనిచేసేవారితో పోలిస్తే బహిరంగ ప్రదేశాల్లో చెమటోడ్చే వారిపైనే భానుడి ప్రతాపం అధికంగా కనిపిస్తోంది.