PM Modi Meditation : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులూ బిజీబిజీగా ఏమాత్రం విరామం లేకుండా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమయ్యారు. పంజాబ్ హోషియార్‌పుర్‌లో తన చివరి ఎన్నికల ప్రచారాన్ని ముగించిన మోదీ ధ్యానం చేసుకునేందుకు కన్యాకుమారికి వెళ్లారు. తొలుత భగవతి అమ్మాన్ మందిరాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోదీకి ఆలయ పూజారులు భగవతి అమ్మాన్ చిత్రపటాన్ని బహూకరించారు.
-
#WATCH | Prime Minister Narendra Modi offers prayer at Bhagavathy Amman Temple in Kanyakumari, Tamil Nadu
— ANI (@ANI) May 30, 2024
He will meditate from 30th May evening to 1st June evening.
PM Modi will meditate day and night at the same place where Swami Vivekanand did meditation, at the Dhyan… pic.twitter.com/xKqZpnuQbV
మొత్తం 45 గంటలపాటు!
ప్రధాని మోదీ మొత్తం 45 గంటలు కన్యాకుమారిలో గడిపేలా ప్రణాళికలు రచించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన స్థలంలో ఆయన స్మారకార్థం రాక్‌మెమోరియల్‌లో మోదీ ధ్యానం చేస్తున్నారు. జూన్ 1 వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు.
-
#WATCH | Prime Minister Narendra Modi arrives at Vivekananda Rock Memorial in Kanyakumari, Tamil Nadu
— ANI (@ANI) May 30, 2024
He will meditate from 30th May evening to 1st June evening.
PM Modi will meditate day and night at the same place where Swami Vivekanand did meditation, at the Dhyan… pic.twitter.com/7QfKkvRLLN
3వేల మందితో భద్రత!
ప్రధాని పర్యటన రీత్యా భద్రతా దళాలు, అధికారులు కన్యాకుమారిలో అన్ని ఏర్పాట్లు చేశారు. 3వేల మందికిపైగా పోలీసులను కన్యాకుమారి, వివేకానందా రాక్ మెమోరియల్ వద్ద మోహరించారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డుతో పాటు తమిళనాడు తీర రక్షణ దళం రంగంలోకి దిగాయి. 3 రోజుల పాటు చేపలవేటను నిషేధించారు. మోదీ ఈసారి కన్యాకుమారిని ఎంపిక చేసుకోవడంపై ఆసక్తి నెలకొంది. 1892లో స్వామి వివేకానందా ఇక్కడే 3 పగళ్లు, 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని నమ్ముతారు. యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడైన మోదీ, వివేకానందాను రోల్‌మోడల్‌గా భావిస్తారు.
ఒక్క మే నెలలోనే!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ తీరిక లేకుండా దేశమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా 200కు పైగా ర్యాలీలు నిర్వహించారు. ఒక్క మేలోనే 96 సభలు నిర్వహించారు. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసికి కూడా తుది దశలోనే పోలింగ్ జరగనుంది.
ఏడో దశ ఎన్నికల ప్రచార గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. తుది దశ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్‌సభ నియోజకవర్గాలు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్ ముగిసింది. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లో 13 చొప్పున, బంగాల్‌లో తొమ్మిది, బిహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఝార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్ జరగనుంది. జూన్ 4 కౌంటింగ్ ఉంటుంది.