PM Modi Bhutan Visit : రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భూటాన్‌కు చేరుకున్నారు. ఉదయం 9 గంటల సమయంలో భూటాన్ రాజధాని థింపూలోని పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భూటాన్ రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భూటాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ప్రధాని పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనలో భారత్-భూటాన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో తాను అక్కడ వివిధ కార్యక్రమాలకు హాజరవుతానని అంతకుముందు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భూటాన్ కింగ్ ది ఫోర్త్ డ్రుక్ గ్యాల్పో, ప్రధాని షెరింగ్ తోబ్గేతో చర్చలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రకారం గురువారమే బయలుదేరాల్సిన ప్రధాని, భూటాన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ప్రయాణం వాయిదా పడింది. 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ'పై భారత వైఖరిని పునరుద్ఘాటించడమే ఈ పర్యటన ఉద్దేశం. ప్రధాని మోదీ తిరిగి శనివారం స్వదేశానికి బయలుదేరనున్నారు.
భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే ఇటీవల దిల్లీలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చలు జరిపారు. తోబ్గేతో తన చర్చలు ఫలవంతంగా సాగాయని మోదీ ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. భారత్-భూటాన్ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని మోదీ-తోబ్గే సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత శనివారం వెలువడిన ఉమ్మడి ప్రకటన తెలిపింది. అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్ ఎదిగేందుకు భారత్ కట్టుబడి ఉందని అందులో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూటాన్ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం భారత్ రూ.5000 కోట్ల సాయం అందించింనందుకు తోబ్గా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, నైపుణ్యరంగాలు, మౌలికవసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పాడతాయని తోబ్గే అన్నారని నివేదిక వెల్లడించింది. ఇరుదేశాల మధ్య రైల్వే లైన్ల నిర్మాణంలో అభివృద్ధిని ప్రధానులు స్వాగతించినట్లు పేర్కొంది. 1020 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు 'పునత్‌షాంగ్చు-2' పట్ల ఇరుదేశాలు సంతృప్తి వ్యక్తంచేసినట్లు నివేదిక తెలిపింది.
-
#WATCH | Delhi: Prime Minister Narendra Modi departed for Bhutan this morning.
— ANI (@ANI) March 22, 2024
The Prime Minister will be on a state visit to Bhutan on March 22-23. pic.twitter.com/RMwI9CiJtN